Agriculture News: రైతు భరోసా కొత్త అప్లికేషన్లు షురూ.. కావాల్సిన పత్రాలు, అర్హతలు ఇవే!

Telangana Rythu Bharosa

Telangana Rythu Bharosa

Telangana Rythu Bharosa: తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీ నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. మూడు విడతల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ పథకం అమలును సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా సుమారు 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి మొదటి విడతగా రూ. 3,590 కోట్లు జమ కానున్నాయి. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు సాగు పనుల ప్రారంభంలో పెద్ద ఊరట లభించనుంది. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి దాదాపు రూ. 9 వేల కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది.

ఇప్పటివరకు ఈ పథకం పరిధిలోకి రాని వారికి, కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 28, 2026 లోపు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఇప్పుడు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీ గ్రామానికి దగ్గరలోని రైతు వేదికల వద్దకు వెళ్లి లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను (AEO) కలిసి తమ అప్లికేషన్లను అందజేయవచ్చు.

కావాల్సిన పత్రాలు ఇవే..
కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు కింద పేర్కొన్న పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు:
ఆధార్ కార్డు జిరాక్స్
కొత్త పట్టాదారు పాస్ పుస్తకం
బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్
పూర్తిగా నింపిన రైతు భరోసా దరఖాస్తు ఫారం.

ఈ పత్రాలను రైతు వేదికల్లో అందజేస్తే, అధికారులు వాటిని పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు. పొరపాట్లు లేకుండా వివరాలు నింపాలని అధికారులు సలహా ఇస్తున్నారు.

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, మార్చి 22న మొదటి విడత నిధులు విడుదలైన 20 రోజుల తర్వాత రెండో విడతగా రూ. 2,650 కోట్లు జమ చేస్తారు. ఇక మిగిలిన మూడో విడత నిధులను ఏప్రిల్ నెలాఖరులోగా రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఏడాదికి ఎకరాకు రూ. 12 వేల చొప్పున అందిస్తున్న ఈ సాయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడికి డబ్బులు అందుతుండటంతో వ్యవసాయ పనులకు ఇబ్బంది ఉండదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.