Union Budget 2026: చరిత్ర సృష్టించబోతున్న ఆర్థిక మంత్రి.. ప్రసంగాన్ని లైవ్ ఎక్కడ చూడాలి అంటే..!!

Union Budget 2026

Union Budget 2026

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026 సమర్పణకు ముహూర్తం ఖరారైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో తన తొమ్మిదో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్‌ను సమర్పించి, అత్యధిక సార్లు వరుసగా ఈ బాధ్యతను నిర్వర్తించిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. దేశం ఎదుర్కొంటున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో ఈ బడ్జెట్‌పై సామాన్యుల నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి.

గత ఆరేళ్ల ఎనిమిది నెలలుగా ఆర్థిక శాఖ పగ్గాలను సమర్థవంతంగా చేపట్టిన నిర్మలా సీతారామన్ కోవిడ్-19 వంటి గడ్డు పరిస్థితులను సైతం తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిపారు. గతంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా, పి.చిదంబరం 9 సార్లు ప్రవేశపెట్టారు. అయితే, వరుసగా 9 సార్లు బడ్జెట్ సమర్పించి దేశ పార్లమెంటరీ చరిత్రలో ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పబోతున్నారు. ప్రధాని మోదీ సైతం ఇది దేశానికే గర్వకారణమని అభివర్ణించారు.

ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం నేడు ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుంది. సంసద్ టీవీ, డీడీ న్యూస్
అధికారిక వెబ్‌సైట్, సంసద్ టీవీ మరియు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) యూట్యూబ్ ఛానెల్‌లు ద్వారా వీక్షించవచ్చు.

ద్రవ్యలోటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY26) ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతంగా అంచనా వేశారు. వచ్చే ఏడాదికి (FY27) దీనిని 4 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటంపై మార్కెట్లు ఆశలు పెట్టుకున్నాయి.

మూలధన వ్యయం

దేశ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఈసారి సుమారు రూ. 12 లక్షల కోట్లకు పైగా కేటాయించే అవకాశం ఉంది. ప్రైవేట్ పెట్టుబడులు ఇంకా పుంజుకోవాల్సి ఉన్నందున, ప్రభుత్వమే భారీ వ్యయంతో ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపించే వ్యూహాన్ని అనుసరించవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఇది 10-15 శాతం పెరిగే అవకాశం ఉంది.

రుణ భారం తగ్గించే రోడ్ మ్యాప్

2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రభుత్వ రుణాలను క్రమంగా తగ్గించి, జీడీపీలో 60 శాతం స్థాయికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా నిర్మలా సీతారామన్ ఎలాంటి కార్యాచరణను ప్రకటిస్తారో చూడాలి.

మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను రాయితీలు దక్కుతాయా? నిరుద్యోగిత నివారణకు ఎలాంటి ఉపాధి హామీ పథకాలు వస్తాయి? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు, మార్కెట్లు ఒడిదుడుకులతో ప్రారంభమైనప్పటికీ, ఆర్థిక మంత్రి ప్రకటనలు స్టాక్ మార్కెట్ దిశను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు తెలుపుతున్నారు.

Union Budget 2026
Union Budget 2026