Hollywood News Telugu:హాలీవుడ్ క్యూట్ కపుల్ టామ్ హాలండ్, జెండయాల పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అంతా షాక్‌కు గురయ్యారు. పెళ్లి ఎప్పుడు జరిగింది? ఎవరికీ చెప్పకుండా ఇంత సైలెంట్‌గా కానిచ్చేశారా? అంటూ రకరకాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. చాలా మంది నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు కూడా చెప్పడం విశేషం.
అయితే, ఈ వైరల్ ఫోటోలపై నటి జెండయా తాజాగా నోరు విప్పారు. ‘జిమ్మీ కిమ్మెల్ లైవ్’ షోలో పాల్గొన్న ఆమె, ఆ ఫోటోలన్నీ ఫేక్ అని తేల్చి చెప్పారు. “నేను బయటకి వెళ్ళినప్పుడు చాలా మంది నన్ను కలిసి ‘మీ పెళ్లి ఫోటోలు చాలా బాగున్నాయి’ అని విష్ చేస్తున్నారు. నాకు మొదట ఏం అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత తెలిసింది అవన్నీ ఏఐ (AI) సృష్టించిన మాయాజాలమని. అవి అసలైన ఫోటోలు కావు, కేవలం టెక్నాలజీతో సృష్టించినవి” అని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఈ పెళ్లి వార్తలకు చెక్ పడినట్లయింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జెండయా వేలికి కనిపించిన ఒక బంగారు ఉంగరం. లూయిస్ విట్టన్ షోలో పాల్గొన్నప్పుడు ఆమె ఎడమచేతి ఉంగరపు వేలికి ఆ రింగ్ ఉండటంతో, టామ్ హాలండ్‌తో సీక్రెట్ మ్యారేజ్ అయిపోయిందని అంతా ఫిక్స్ అయ్యారు. దీనికి తోడు వారి సెలబ్రిటీ స్టైలిస్ట్ లా రోచ్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడుతూ.. “పెళ్లి ఎప్పుడో అయిపోయింది, మీరు మిస్ అయ్యారు” అని అనడం మంటకు నెయ్యి పోసినట్లయింది. అయితే అదంతా జోక్ అని ఇప్పుడు అర్థమవుతోంది.
నిజానికి టామ్ హాలండ్, జెండయా ఎంగేజ్మెంట్ గత ఏడాది జనవరిలోనే జరిగినట్లు వార్తలు వచ్చాయి. టామ్ తండ్రి డొమినిక్ హాలండ్ కూడా తన బ్లాగ్‌లో కొడుకు పెళ్లి ప్రపోజల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టామ్ చాలా ప్లాన్డ్గా, జెండయా తండ్రి అనుమతి తీసుకుని మరీ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుండి ఈ జంట ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్ పరంగా కూడా చాలా బిజీగా ఉన్నారు. ‘స్పేడర్ మ్యాన్’ సిరీస్‌లో కలిసి నటించి మెప్పించిన ఈ జంట, త్వరలో ‘స్పేడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’తో పాటు లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ‘ది ఒడిస్సీ’ చిత్రంలోనూ కలిసి నటించబోతున్నారు. సో, ప్రస్తుతానికి వీరి పెళ్లి ఫోటోలు కేవలం ఏఐ సృష్టించిన సృజనాత్మకత మాత్రమే. వీరి అసలైన పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి.
