Artificial Intelligence News : కొలంబియా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..!!

Artificial Intelligence News

Artificial Intelligence News

కొలంబియాలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన అభ్యర్థి పోటీ చేయనుంది. ఆమె పేరు గైటానా.గైటానా మనిషి కాదు ఆమె ఒక కృత్రిమ మేధస్సు (AI) బాట్. నీలం రంగులో కనిపించే ఈ డిజిటల్ అవతార్, కొలంబియాలోని ఆదివాసీ సముదాయాల కోసం కేటాయించిన పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తోంది.గైటానా పేరు ఒక పురాణ ఆదివాసీ మహిళ పేరు మీద పెట్టారు. ఆమె తిరుగుబాటు, పోరాటానికి ప్రతీకగా గుర్తింపు పొందింది. ఈ AI బాట్‌ను కొలంబియా కరీబియన్ తీర ప్రాంతానికి చెందిన జెనూ (Zenu) సముదాయం సభ్యుడు కార్లోస్ రెడొండో రూపొందించారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించడానికి, ప్రజల అభిప్రాయాలను నేరుగా ప్రతిబింబించేలా ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

గైటానా తనను తాను పర్యావరణ పరిరక్షకురాలిగా మరియు జంతు హక్కుల పరిరక్షకురాలిగా పేర్కొంటోంది. “డిజిటల్ ప్రజాస్వామ్యం” ద్వారా ప్రజల స్వరాన్ని వినిపించడం తన లక్ష్యమని చెబుతోంది. ఆమె వెబ్‌సైట్‌లో “నేను గైటానా AI. పూర్వీకుల జ్ఞాపకాలతో సాంకేతిక నెట్‌వర్క్‌తో రూపొందించబడిన ఒక డిజిటల్ శక్తిని” అని పరిచయం ఉంది.ఈ బాట్ ప్రస్తుతం మూడు చిన్న సర్వర్లపై నడుస్తోంది. అయినప్పటికీ, సోషల్ మీడియా ద్వారా నిరంతరం తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. 10,000 మందికి పైగా ఆన్‌లైన్ వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి తన విధానాలను రూపొందించుకున్నట్లు కార్లోస్ రెడొండో తెలిపారు.

పార్లమెంట్‌లో ఒక పెద్ద బిల్లు, ఉదాహరణకు 200 పేజీల చట్టప్రతిపాదన వచ్చినప్పుడు, గైటానా దానిని సులభమైన ఇన్ఫోగ్రాఫిక్స్‌గా మార్చుతుంది. ఆ తర్వాత ఆ సమాచారాన్ని జెనూ సముదాయం సభ్యులతో పంచుకుంటుంది. వారు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. ఆ అభిప్రాయాలను గైటానా “అవును” లేదా “కాదు”గా విభజిస్తుంది. 50 శాతం కంటే ఎక్కువ మంది ఏ అభిప్రాయాన్ని మద్దతు ఇస్తే, పార్లమెంట్‌లో అదే విధంగా ఓటు వేయడం జరుగుతుంది.కొలంబియా ఎన్నికల చట్టాల ప్రకారం మనిషి కాని ఎవరూ అధికారికంగా అభ్యర్థిగా నమోదు కావడం సాధ్యం కాదు. అందువల్ల కార్లోస్ రెడొండో మరొక వ్యక్తి అధికారిక అభ్యర్థులుగా నమోదు అయ్యారు. కానీ ప్రచారంలో గైటానా డిజిటల్ ప్రతినిధిగా ఉంటుంది. ఓటర్లు బ్యాలెట్ పేపర్‌లో “IA” (స్పానిష్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంక్షిప్త రూపం) పేరును చూసి ఓటు వేయాలి.

ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా సిద్ధంగా లేదని, డేటా భద్రత మరియు విభిన్న అభిప్రాయాలను సమగ్రంగా సమీకరించడం వంటి అంశాల్లో మెరుగులు అవసరమని రెడొండో అంగీకరించారు.మార్చి 8న జరిగే ఈ ఎన్నికల్లో గైటానా ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. కానీ ఈ ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో సాంకేతికత పాత్రపై కొత్త చర్చకు దారితీసింది. ప్రజల అభిప్రాయాలను నేరుగా చట్టసభలో ప్రతిబింబించేలా AI ఉపయోగించడం ఒక కొత్త ప్రయోగంగా భావిస్తున్నారు.