April 1 New Rules: బ్యాంకింగ్ అలర్ట్..‌ రేపటి నుంచే కొత్త బ్యాంకింగ్ నియమాలు..కస్టమర్లు ఇవి తెలుసుకోవాల్సిందే..!!

April 1 New Rules

April 1 New Rules

April 1 New Rules: మార్చి నెల ముగింపుకు వచ్చేసింది. రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్థిక రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారుల నుంచి సామాన్య గృహిణుల వరకు అందరిపై ప్రభావం చూపే ఈ కొత్త నిబంధనల గురించి ముందే తెలుసుకోవడం అవసరం. బ్యాంకింగ్ ఛార్జీలు, పాన్ కార్డు అప్లికేషన్ ప్రాసెస్, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు ఇలా అనేక అంశాల్లో మార్పులు రాబోతున్నాయి.

పాన్ కార్డు నిబంధనల్లో మార్పు

ఇప్పటి వరకు కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలంటే కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది. కానీ రేపటి నుంచి ఈ నిబంధన మారనుంది. ఇకపై పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు అదనపు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కేవలం గుర్తింపు కోసమే కాకుండా, పుట్టిన తేదీని ఖచ్చితంగా నిర్ధారించేలా పదో తరగతి మార్కుల జాబితా (10th Memo), ఓటర్ ఐడీ లేదా మున్సిపల్ బర్త్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లు తప్పనిసరి చేసే అవకాశం ఉంది. డేటా సెక్యూరిటీని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

క్రెడిట్, డెబిట్ కార్డుల కొత్త పాలసీ

క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడేవారికి ఎస్బీఐ షాక్ ఇచ్చింది. రివార్డ్ పాయింట్ల వినియోగంపై పరిమితులు విధించింది. ముఖ్యంగా నెలవారీ రిడెంప్షన్ పాయింట్లను 60 వేలకు పరిమితం చేయడంతో పాటు, కొన్ని కార్డులపై ఇచ్చే క్యాష్‌బ్యాక్ సౌకర్యాలను తగ్గించింది. మరోవైపు రూపే ప్లాటినం డెబిట్ కార్డు వాడేవారు కూడా జాగ్రత్త పడాలి. కేవలం కార్డు ఉందన్న కారణంతో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌ల్లోకి ఉచితంగా ప్రవేశించే అవకాశం ఇకపై ఉండదు. కార్డు ద్వారా నిర్ణీత మొత్తం ఖర్చు చేస్తేనే ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు.

బ్యాంకు కస్టమర్లపై ఛార్జీల భారం

ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన లాకర్ ఛార్జీలను భారీగా పెంచింది. మీరు ఉండే ప్రాంతం, లాకర్ సైజును బట్టి ఈ ఫీజులు మారతాయి. అంతేకాకుండా ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసే విషయంలో కూడా పరిమితులు వచ్చాయి. ఉచిత లావాదేవీల పరిమితి దాటితే అదనపు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంకులు కూడా నగదు ఉపసంహరణ విధానాల్లో మార్పులు చేశాయి. ఇక ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రతి డిజిటల్ పేమెంట్ కు ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’ తప్పనిసరి కానుంది, ఇది ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

వాహనదారులకు ఫాస్టాగ్ సెగ

హైవేలపై ప్రయాణించే వారికి ‘ఫాస్టాగ్’ బాదుడు తప్పదు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వార్షిక పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ. 3,000 గా ఉన్న వార్షిక పాస్ ధర రేపటి నుంచి రూ. 3,075 కి చేరనుంది. టోల్ ధరల సవరణ వల్ల రవాణా ఖర్చులు కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అంతరాయం కలగకుండా ఉండాలంటే గడువు లోపు కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

గ్యాస్ సిలిండర్, ఇంధన ధరల సమీక్ష

ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల ఒడిదుడుకుల దృష్ట్యా వంట గ్యాస్ (LPG) ధరలు పెరగడమో లేదా తగ్గడమో జరగవచ్చు. దీనితో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటితో పాటు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి, టాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ‘అప్‌డేటెడ్ ఐటీఆర్’ సౌకర్యం కూడా రేపటి నుంచే అందుబాటులోకి రానుంది.‌