IPL Updates: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ అభిమానులకు ఒక చిన్న షాక్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో లేకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, సెకండ్ ఇన్నింగ్స్‌లో అతడిని ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు సూర్యను నేరుగా తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు? అతడికి ఏమైంది? అనే ప్రశ్నలపై తాజాగా ముంబై కోచ్ మహేల జయవర్ధనె స్పందించారు.
టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో ముంబై యాజమాన్యం ఆచితూచి అడుగులు వేస్తోంది. సూర్యకుమార్ యాదవ్‌కు గజ్జల్లో (Groin) స్వల్పంగా నెప్పి ఉండటమే దీనికి ప్రధాన కారణమని జయవర్ధనె వెల్లడించారు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అతనికి కొంత విశ్రాంతి అవసరమని, అందుకే ముందు జాగ్రత్తగా బెంచ్‌పై కూర్చోబెట్టామని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన ఊహాగానాలు సృష్టించవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.
“జట్టులో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సూర్య ప్రాక్టీస్ సెషన్స్‌లో చురుగ్గానే పాల్గొన్నాడు. కానీ, గజ్జల్లో చిన్నపాటి అసౌకర్యం ఉండటంతో రిస్క్ తీసుకోవడం మాకు ఇష్టం లేదు. వచ్చే మ్యాచ్‌కి ఇంకా ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి, అతనికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని భావించాం. చివర్లో మూడు నాలుగు ఓవర్లు ఫీల్డింగ్ చేయడానికి కూడా అతను ఆసక్తి చూపాడు, కానీ మేమే వద్దని వారించాం,” అని జయవర్ధనె వివరించారు.
నిజానికి గత సీజన్‌లో రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడిన ముంబై, ఇప్పుడు సూర్య విషయంలో అదే వ్యూహాన్ని అనుసరించింది. కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 8 బంతులు మాత్రమే ఆడి 16 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యంతో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై సునాయాసంగా ఛేదించింది. దీంతో సూర్య భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం లేకుండానే ముంబై ఘనవిజయం సాధించింది.
సీజన్ పొడవునా సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్ల సేవలు జట్టుకు చాలా అవసరమని, అందుకే మేనేజ్‌మెంట్ ఇలాంటి లెక్కలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటుందని జయవర్ధనె పేర్కొన్నారు. సూర్య ఫిట్‌నెస్‌పై ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ముంబై క్యాంప్ భరోసా ఇచ్చింది.
