North Korea Flights: ఉత్తర కొరియా కీలక నిర్ణయం..గగనతల ఆంక్షలు ఎత్తివేత.. చైనా విమానానికి గ్రాండ్ వెల్కమ్..!

North Korea Flights

North Korea Flights

North Korea Flights: సుమారు ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత చైనా, ఉత్తర కొరియా దేశాల మధ్య మళ్లీ విమాన రాకపోకలు మొదలయ్యాయి. ప్రపంచ దేశాల నుంచి దాదాపుగా వేరుపడిపోయిన ఉత్తర కొరియా (నార్త్ కొరియా), ఇప్పుడు నెమ్మదిగా తన సరిహద్దులను తెరుస్తోంది. సోమవారం ఉదయం చైనాకు చెందిన జాతీయ విమానయాన సంస్థ ‘ఎయిర్ చైనా’, బీజింగ్ నుండి ప్యాంగ్యాంగ్‌కు నేరుగా విమాన సర్వీసును ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య కొత్త దౌత్య అధ్యాయం మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజానికి 2018 తర్వాత ఈ స్థాయిలో విమాన ప్రయాణాలు జరగడం ఇదే మొదటిసారి. 2020లో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఉత్తర కొరియా తన సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. బయటి దేశాల నుంచి ఎవరినీ లోపలికి రానివ్వకుండా కఠినమైన ఆంక్షలు విధించింది. అయితే, గత కొంతకాలంగా చైనా, రష్యాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్న కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం, ఇప్పుడు సాధారణ ప్రయాణికులకు కూడా మార్గం సుగమం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎయిర్ చైనా విమానం ప్యాంగ్యాంగ్ గడ్డపై ల్యాండ్ అయ్యింది.

ఫ్లైట్ డేటా ప్రకారం.. ఎయిర్ చైనాకు చెందిన CA121 విమానం సోమవారం ఉదయం 7:58 గంటలకు బీజింగ్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరింది. ఇది సుమారు రెండు గంటల ప్రయాణం తర్వాత ఉదయం 11 గంటలకు ప్యాంగ్యాంగ్‌లోని సునన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో ప్రయాణించేందుకు చైనా వ్యాపారవేత్తలు, అధికారులు ఎంతో ఉత్సాహం చూపించారు. ప్రస్తుతానికి ఎకానమీ క్లాస్ టికెట్ ధర సుమారు 200 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 16,500) గా ఉన్నట్లు సమాచారం.

విమాన సర్వీసులు మొదలైనప్పటికీ, పర్యాటకుల విషయంలో ఉత్తర కొరియా ఇంకా ఆచి తూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కేవలం అధికారిక అనుమతులు ఉన్నవారు, అత్యవసర పనుల మీద వెళ్లే వారు మాత్రమే ఈ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. సాధారణ పర్యాటక వీసాల జారీపై ఆ దేశం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, త్వరలోనే పర్యాటక రంగం కూడా పుంజుకుంటుందని, ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయని చైనా పర్యాటక సంస్థలు ఆశిస్తున్నాయి.

గత ఏడాది రష్యాతో విమాన, రైలు సర్వీసులను పునరుద్ధరించిన ఉత్తర కొరియా, ఇప్పుడు చైనాతో కూడా అదే బాటలో నడుస్తోంది. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థకు చైనా వెన్నెముక లాంటిది. ఆ దేశానికి అవసరమైన మెజారిటీ వాణిజ్యం చైనా ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి రావడంతో, ఆ దేశంపై ఉన్న ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ సర్వీసులను వారానికి మూడు సార్లు పెంచే ఆలోచనలో ఎయిర్ చైనా ఉన్నట్లు తెలుస్తోంది.