AP Housing Scheme: ఏపీ పేదలకు అదిరిపోయే తీపి కబురు.. టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!!

AP Housing Scheme

AP Housing Scheme

AP Housing Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో తీపికబురు అందించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ 2029 నాటికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని పుదూరులో జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అక్కడ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసి, వారితో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు.

రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం పేర్కొన్నారు. గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు భారీగా ఇళ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల ఇళ్లలో లబ్ధిదారులు చేరబోతున్నారని, ఇప్పటివరకు మొత్తం 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని వివరించారు. ఇదే ఊపుతో రాబోయే డిసెంబర్ నాటికి మరో 4.50 లక్షల కొత్త ఇళ్లను సిద్ధం చేసి పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. గత పాలకులు ఇళ్ల నిర్మాణ పథకాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పాత ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద చెల్లించాల్సిన రూ.920 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం రాగానే క్లియర్ చేసిందని చెప్పారు. అలాగే టిడ్కో ఇళ్ల కోసం అప్పట్లో డిపాజిట్లు కట్టిన 82 వేల మంది బాధితులకు రూ.174 కోట్లను ఈ నెలలోనే తిరిగి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం నిధులు మళ్లించడం వల్ల కేంద్రం రాష్ట్రానికి రూ.28 కోట్ల జరిమానా విధించిందని, అటువంటి తప్పులు ఇకపై జరగవని ఆయన స్పష్టం చేశారు.

కేవలం ఇళ్లు కట్టడమే కాకుండా, పేదల జీవన ప్రమాణాలు పెంచేలా మరికొన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ పైపుల ద్వారా గ్యాస్ సరఫరా (PNG) అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లే, స్టవ్ ఆన్ చేస్తే గ్యాస్ వచ్చేలా చేస్తామని, దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వివరించారు. అలాగే సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

పాలనలో పారదర్శకత కోసం ఏప్రిల్ నుంచి తాను స్వయంగా రంగంలోకి దిగుతానని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడా అవినీతికి తావుండకూడదని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ప్రజలను వేధించినా, ఒక్క రూపాయి లంచం అడిగినా సహించేది లేదని కరాఖండిగా చెప్పారు. సాంకేతికతను వాడుకుని ‘వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు.