NTR Bharosa Pension : కొత్త పింఛన్ల దరఖాస్తులపై మంత్రి క్లారిటీ.. ఫేక్ వార్తలను నమ్మవద్దు!

NTR Bharosa Pension

NTR Bharosa Pension

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులకు న్యాయం చేస్తూనే, అనర్హుల ఏరివేతపై సీరియస్ ఫోకస్ పెట్టింది. ఇకపై పింఛన్ల జాబితాలో అనర్హులు ఉంటే వారిని తొలగించే పూర్తి బాధ్యతను అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.

ఇప్పటివరకు పింఛన్ల తొలగింపు ప్రక్రియపై ఉన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. శాసనసభలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పొందుతున్న వారిలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లు గుర్తిస్తే, ప్రజలు నేరుగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదులపై కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిజంగా వారు అర్హులు కాదని తేలితే వెంటనే వారి పింఛన్లను రద్దు చేసే అధికారం ఇప్పుడు కలెక్టర్లకే ఉంటుందని మంత్రి వివరించారు.

ఈ నిర్ణయం కేవలం కాగితాలకే పరిమితం కాలేదని, అప్పుడే అమలు కూడా మొదలైందని మంత్రి ఉదాహరణలతో సహా వివరించారు. కడప జిల్లాలో సుమారు 3 వేల మంది దివ్యాంగుల పింఛన్లపై ఫిర్యాదులు రావడంతో, కలెక్టర్ స్వయంగా విచారణ చేపట్టారని పేర్కొన్నారు. ఈ విచారణలో సుమారు 70 శాతం మంది అనర్హులుగా తేలడంతో వారిని వెంటనే జాబితా నుంచి తొలగించామని మంత్రి సభకు తెలిపారు. అర్హులకు దక్కాల్సిన ఫలాలను అనర్హులు దోచుకోకుండా అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో భారీగా పింఛన్లు ఇస్తున్నామని మంత్రి గర్వంగా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో:
వయోవృద్ధులు: 29.86 లక్షల మందికి నెలకు రూ. 4,000 చొప్పున సుమారు రూ. 1,194 కోట్లు పంపిణీ చేస్తున్నారు.
దివ్యాంగులు: 7.65 లక్షల మందికి నెలకు రూ. 6,000 చొప్పున సుమారు రూ. 459 కోట్లు అందిస్తున్నారు.
వితంతువులు: 17.35 లక్షల మందికి నెలకు రూ. 4,000 చొప్పున సుమారు రూ. 694 కోట్లు ఇస్తున్నారు.
రాష్ట్ర జనాభాలో దాదాపు 12.88 శాతం మందికి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోందని మంత్రి లెక్కలతో సహా వివరించారు.

ఈ చర్చలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా స్పందించారు. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఉన్న అనర్హులను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మరోవైపు, కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా మంత్రి శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని, ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ అప్లికేషన్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన
తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.