Rashmika Mandanna : మిసెస్ దేవరకొండగా రష్మిక కొత్త ప్రయాణం.. వెండితెరకు ‘నేషనల్ క్రష్’ గుడ్ బై చెప్పనుందా?

Rashmika Mandanna

Rashmika Mandanna

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న వీరి ప్రేమాయణం పెళ్లి పీటల వరకు చేరడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే, ఈ పెళ్లి సంబరాల మధ్యే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ‘కుమారి’ రష్మిక కాస్తా ‘శ్రీమతి’గా మారడంతో, ఆమె ఇకపై సినిమాల్లో నటిస్తుందా? లేక కుటుంబ జీవితానికే పరిమితం అవుతుందా? అన్న సందేహం సగటు సినీ ప్రేక్షకుడిని తొలుస్తోంది. సాధారణంగా హీరోయిన్లకు పెళ్లయితే కెరీర్ ముగిసినట్లే అన్న పాత కాలపు ముద్రను రష్మిక చెరిపివేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

నిజానికి రష్మిక కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. కేవలం సౌత్ అనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘రణబాలి’పై భారీ అంచనాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత వీరిద్దరూ వెండితెరపై జంటగా కనిపించబోతున్న మొదటి సినిమా కావడంతో దీనికి విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. దీనితో పాటు బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో ‘కాక్ టైల్ 2’, అలాగే పవర్ ఫుల్ యాక్షన్ మూవీ ‘మైసా’ వంటి ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆమె అంత సులభంగా సినిమాలకు స్వస్తి చెప్పే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

ఒకప్పుడు పెళ్లైన హీరోయిన్లను ప్రేక్షకులు ఆదరించరనే భావన ఉండేది. కానీ సమంత, నయనతార వంటి తారలు ఆ సంప్రదాయాన్ని ఎప్పుడో బ్రేక్ చేశారు. పెళ్లయ్యాక కూడా స్టార్ హీరోయిన్లుగా రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రష్మిక కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. అయితే, పెళ్లి తర్వాత ఆమె కథల ఎంపికలో మార్పు ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మునుపటిలా కమర్షియల్ సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలు లేదా వెయిట్ ఉన్న క్యారెక్టర్లనే ఆమె ఎంచుకునే అవకాశం ఉంది.

కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన రష్మిక, తన వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించడం కోసం కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవచ్చు. కానీ, నటనపై ఆమెకున్న మక్కువను బట్టి చూస్తే, త్వరలోనే మళ్ళీ ముఖానికి రంగు వేసుకోవడం ఖాయం. అసలే ‘నేషనల్ క్రష్’గా కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్న రష్మికను వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ కూడా తన భార్య కెరీర్‌కు పూర్తి మద్దతు ఇస్తారని సన్నిహిత వర్గాల సమాచారం.
రష్మిక మందన్న సెకండ్ ఇన్నింగ్స్ మరింత జోరుగా సాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.