ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాల జారీలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, అనర్హుల పట్టాలను రద్దు చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, అర్హత లేని వారికి కూడా పట్టాలు కట్టబెట్టారని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ జరిపి, అక్రమంగా పొందిన పట్టాలను తక్షణమే వెనక్కి తీసుకుంటామని మంత్రి ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యంగా గత ఐదేళ్లలో కొన్ని జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా పట్టాల పంపిణీ సాగిందని మంత్రి ఆరోపించారు. రైతులకు భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండానే, భూమిని స్వాధీనం చేసుకోకముందే పట్టాలు ఇచ్చేసిన ఘటనలు ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని చోట్ల నకిలీ పట్టాలు కూడా సృష్టించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇలాంటి అక్రమ వ్యవహారాలన్నింటినీ గుట్టురట్టు చేస్తామని, నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఏవై (PMAY) నిధుల పంపిణీలోనూ మంత్రి క్లారిటీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ. 2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.59 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. యూఎల్బీ (ULB), యూడీఏ (UDA) పరిధిలో నిధుల కేటాయింపులో ఉన్న వ్యత్యాసాలను కూడా ఆయన వివరించారు. లబ్ధిదారులు ఒకరి స్థలంలో మరొకరు ఇళ్లు నిర్మించుకున్న సాంకేతిక ఇబ్బందులను కూడా పరిష్కరిస్తామని, అధికారుల నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు భూముల రీ-సర్వే అంశంపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కేవలం సరిహద్దు రాళ్లు పాతడంపైనే దృష్టి పెట్టిందని, కానీ భూ వివాదాల పరిష్కారాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ‘రీ-సర్వే 2.0’ పేరుతో మరింత పారదర్శకంగా సర్వే నిర్వహిస్తోందని చెప్పారు. రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా భవిష్యత్తులో భూ ఆక్రమణలకు తావులేకుండా చేస్తామని, ఇప్పటికే 6,688 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావస్తోందని ఆయన వెల్లడించారు.
ఇళ్ల పట్టాల రద్దు ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనర్హులని తేలితే పట్టాలు పోతాయన్న భయం ఒకవైపు ఉన్నా, నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందన్న ఆశ మరోవైపు కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా విచారణ ఎంత వేగంగా జరుగుతుందో, ఎన్ని పట్టాలు రద్దు అవుతాయో వేచి చూడాలి. పారదర్శకత పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు సామాన్య ప్రజలకు మేలు చేస్తాయా లేదా అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది
