ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఏపీ హైకోర్టుకు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సు చేసింది. ప్రస్తుతం పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఆమెను ఏపీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా ఒక ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అయిన తర్వాతే కొత్త వారిని నియమిస్తుంటారు. కానీ, ఈసారి సుప్రీంకోర్టు కొలీజియం ఒక సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ఆయన పదవిలో ఉండగానే.. రెండు నెలల ముందే జస్టిస్ లిసా గిల్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది. దీనివల్ల ఆమె ఇక్కడి పరిస్థితులను, కోర్టు వాతావరణాన్ని ముందుగానే అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
చండీగఢ్‌లో పుట్టి పెరిగిన జస్టిస్ లిసా గిల్, విద్యాభ్యాసం అంతా అక్కడే పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన ఆమె, 1990లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సివిల్, క్రిమినల్ మరియు రాజ్యాంగ పరమైన అంశాల్లో ఆమెకు మంచి పట్టు ఉంది. ఆమె ప్రతిభను గుర్తించి 2014లో పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించారు. సుదీర్ఘ కాలం పాటు న్యాయమూర్తిగా విశేష సేవలు అందించిన ఆమె, ఇప్పుడు ఏపీ హైకోర్టు పగ్గాలు చేపట్టబోతున్నారు.
మరోవైపు, ప్రస్తుత ఏపీ సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లే అవకాశం ఉన్నట్లు న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన ఏప్రిల్‌లో రిటైర్ కానున్న నేపథ్యంలో, ఈ లోపే ఆయనకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆయన స్థానంలో జస్టిస్ లిసా గిల్ బాధ్యతలు స్వీకరిస్తే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన తర్వాత ఒక మహిళా న్యాయమూర్తి సీజే కావడం ఇదే మొదటిసారి అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సును ఆమోదించి, రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ మార్పు ఏపీ న్యాయ వ్యవస్థలో మరింత పారదర్శకతను, వేగాన్ని తీసుకొస్తుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
