Space News 2026: మన భూమికి అత్యంత సమీపంలో ఉండే చందమామ కాలక్రమేణా చిన్నదిగా మారిపోతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా చంద్రుడి లోపలి భాగం చల్లబడుతుండటంతో, దాని ఉపరితలం కుంచించుకుపోతోంది. వాషింగ్టన్ లోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం పరిశోధకులు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మార్పు గతంలో అనుకున్న దానికంటే చాలా వేగంగా జరుగుతోందని తేలింది. దీనివల్ల చంద్రుడిపై పగుళ్లు ఏర్పడటమే కాకుండా ‘మూన్ క్వేక్స్’ (చంద్ర కంపనలు) కూడా సంభవిస్తున్నాయి.
ఈ కుంచించుకుపోయే ప్రక్రియ చంద్రుడి పైపొరపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. దీనివల్ల ఉపరితలంపై ‘లోబేట్ స్కార్ప్స్’ అని పిలిచే చిన్నపాటి కొండలు, మడతలు ఏర్పడుతున్నాయి. అంటే, ఒక తాజా ద్రాక్ష పండు ఎండిపోయి కిస్మిస్ లాగా ఎలా ముడతలు పడుతుందో, మన చందమామ కూడా అలాగే ముడతలు పడుతున్నాడని శాస్త్రవేత్తలు ఉదాహరణగా చెబుతున్నారు. ఈ భౌగోళిక మార్పుల వల్ల చంద్రుడి ఉపరితలం అస్థిరంగా మారుతోంది. ఇది కేవలం పరిశోధనలకు మాత్రమే పరిమితం కాకుండా, భవిష్యత్తులో చంద్రుడిపై అడుగుపెట్టాలనుకునే మానవులకు పెద్ద సవాలుగా మారనుంది.
ముఖ్యంగా నాసా (NASA) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్’ ప్రోగ్రామ్ పై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. 2028 నాటికి చంద్రుడిపై మనుషులను పంపి, అక్కడ శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ చంద్ర కంపనలు రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో వస్తున్నాయని, ఇవి దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగుతున్నాయని గుర్తించారు. ఇంతటి భారీ ప్రకంపనలు వస్తే అక్కడ నిర్మించే భవనాలు, యంత్రాలు తట్టుకోవడం కష్టమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రకంపనలు ఎక్కడ వస్తున్నాయి? ఏ ప్రాంతాలు సురక్షితం? అనే అంశాలపై శాస్త్రవేత్తలు ఇప్పుడు లోతైన అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు జరుగుతున్న తరుణంలో, అక్కడ ఉన్న పగుళ్లు భవిష్యత్తు ల్యాండింగ్ సైట్లకు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. అందుకే, చంద్రుడిపై ఏ ప్రాంతంలో దిగాలి, అక్కడ భూకంపాలను తట్టుకునేలా ఎలాంటి టెక్నాలజీ వాడాలి అనే దానిపై శాస్త్రవేత్తలు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు, చంద్రుడి లోపల జరుగుతున్న ఈ మార్పులు భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి భూమికి నేరుగా ముప్పు లేకపోయినప్పటికీ, చందమామలో వస్తున్న ఈ మార్పులు సౌర కుటుంబ చరిత్రను అర్థం చేసుకోవడానికి కీలకంగా మారాయి. అంతరిక్ష ప్రయోగాలు ఊపందుకుంటున్న ఈ తరుణంలో, చంద్రుడి అస్థిరత అనేది శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాలుగా నిలిచింది.
