సెలవు రోజైనా లేదా ఏదైనా ప్రత్యేక సందర్భమైనా సరే, మన ఇంట్లో నాన్-వెజ్ వంటకం ఉండాల్సిందే. సాధారణంగా అందరూ బిర్యానీ వైపు మొగ్గు చూపుతారు కానీ, తక్కువ సమయంలో, అంతకంటే అద్భుతమైన రుచితో ‘చిల్లీ మటన్ పులావ్’ ఈజీగా చేసుకోవచ్చు ఈ పులావ్ ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చిటికెలో వండుకోవచ్చు. ముక్క మెత్తగా ఉడికి, అన్నం పొడిపొడిగా వచ్చేలా చేసే ఈ వంటకం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఫిదా చేయడం ఖాయం.
ఈ పులావ్ రుచికి ప్రధాన కారణం అందులో వాడే ‘మ్యాజిక్ మసాలా’. దీన్ని తయారు చేయడానికి ధనియాలు, జీలకర్ర, సోంపుతో పాటు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కను కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా దంచి వేయడం వల్ల పులావ్‌కు ఒక ప్రత్యేకమైన ఘాటు, సువాసన వస్తాయి. ఈ తాజా మసాలాలే హోటల్ స్టైల్ రుచిని మన వంటగదిలోకి తీసుకొస్తాయి.
ముందుగా అర కిలో మటన్‌ను శుభ్రం చేసుకుని, అందులో సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, మ్యాజిక్ మసాలా పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనికి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల మటన్ ముక్కలు వెన్నలా కరిగిపోయేలా తయారవుతాయి. ఉడికించిన తర్వాత మటన్ ముక్కలను, ఆ సూప్‌ను విడివిడిగా పక్కన పెట్టుకోవాలి. ఈ సూప్ లోనే అసలైన పోషకాలు, రుచి దాగి ఉంటాయి, దీన్నే మనం అన్నం ఉడికించడానికి వాడతాము.
కుక్కర్లో నెయ్యి, నూనె వేసి వేడి అయ్యాక గరం మసాలాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత కేవలం మటన్ ముక్కలను మాత్రమే వేసి, టమాటా, పెరుగు మరియు చిల్లీ ఫ్లేక్స్‌తో కలిపి బాగా ఫ్రై చేయాలి. ఈ దశలో మటన్ ముక్కలకు మసాలాలన్నీ పట్టి మంచి రంగు వస్తుంది. ఆపై మనం పక్కన పెట్టుకున్న మటన్ సూప్‌ను వడకట్టి పోయాలి.
ఎప్పుడైతే ఎసరు మరుగుతుందో, అప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి సరిపడా ఉప్పు చూసుకోవాలి.
చివరగా కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికిస్తే చాలు, గుమగుమలాడే చిల్లీ మటన్ పులావ్ సిద్ధం. ఇందులో వాడే సోంపు పచ్చిమిర్చి ఘాటు ప్రతి ముక్కకు, ప్రతి మెతుకుకు పట్టి అద్భుతమైన ఫ్లేవర్‌ను ఇస్తుంది. ఈ పులావ్‌ను వేడివేడిగా పెరుగు రైతాతో లేదా ఏదైనా గ్రేవీతో తింటే ఆ తృప్తే వేరు. తక్కువ మసాలాలతో కమ్మగా ఉండే ఈ వంటకాన్ని ప్రతి ఒక్కరూ డెఫినెట్‌గా ట్రై చేయాల్సిందే.
