Andhra Pradesh Gram Panchayats ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఆర్థిక కష్టాలను తీరుస్తూ కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS), బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (BPS) ద్వారా వచ్చే ఆదాయంలో పంచాయతీలకే దక్కనుంది. ఇప్పటివరకు ఈ నిధుల విషయంలో స్పష్టత లేక పల్లెల్లో అభివృద్ధి పనులు కుంటుపడగా, తాజా నిర్ణయంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు అందనున్నాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ఈ కీలక అడుగు పడినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ఖరారు చేసిన కొత్త నిధుల పంపిణీ నిష్పత్తి ప్రకారం.. వసూలైన మొత్తం ఆదాయంలో 50 శాతం నిధులు నేరుగా సంబంధిత గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి వెళ్తాయి. మిగిలిన నిధుల్లో 30 శాతాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు (UDA), 20 శాతాన్ని రాష్ట్ర పట్టణ ప్రణాళికా విభాగం (Town Planning) నిధికి కేటాయించనున్నారు. దీనివల్ల ఏ గ్రామంలో అయితే ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ద్వారా ఆదాయం వస్తుందో, ఆ నిధులను తిరిగి అదే గ్రామాభివృద్ధికి ఖర్చు చేసే అవకాశం కలుగుతుందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని మెజారిటీ పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కనీసం వీధి దీపాలు వేయాలన్నా, డ్రైనేజీలు శుభ్రం చేయాలన్నా, మురుగు కాలువల మరమ్మతులు చేపట్టాలన్నా నిధులు లేక సర్పంచులు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎల్ఆర్ఎస్ నిధుల్లో సగం వాటా ఇస్తామన్న ప్రకటన గ్రామీణ స్థాయిలో పెద్ద ఊరటనిస్తోంది. దీనివల్ల పంచాయతీలకు సొంత ఆదాయం పెరిగి, చిన్న చిన్న పనుల కోసం ప్రభుత్వం వైపు చూడాల్సిన అవసరం తప్పుతుంది.
ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం.. తాము చెల్లించే రుసుము తమ ఊరి అభివృద్ధి కేసనని తెలిస్తే, ప్రజలు కూడా ఆస్తుల క్రమబద్ధీకరణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. అంతర్గత రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులకు ఈ నిధులు వెన్నెముకలా మారనున్నాయి. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న కీలక అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధికి తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
