iPhone 17 మ్యాజిక్: ఆపిల్ ఖాతాలో రికార్డు స్థాయి లాభాలు!

iphone

iPhone 17 : టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 17 సిరీస్‌తో సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ ఫోన్లకు మార్కెట్‌లో ఊహించని డిమాండ్ ఏర్పడటంతో, కంపెనీ ఆదాయం మునుపెన్నడూ లేని విధంగా పెరిగింది. 2025 డిసెంబర్ 27తో ముగిసిన త్రైమాసికంలో ఆపిల్ ఏకంగా 143.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 12 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది.

గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఆదాయం 16 శాతం పెరిగి $143.8 బిలియన్లకు చేరింది. ఇందులో నికర లాభం $42.09 బిలియన్లుగా నమోదైంది.
కేవలం ఐఫోన్ అమ్మకాల ద్వారానే $85.27 బిలియన్ల ఆదాయం సమకూరింది. ఐఫోన్ సేల్స్ ఏకంగా 23 శాతం వృద్ధి చెందడం విశేషం.
ఆపిల్ టీవీ, ఆపిల్ మ్యూజిక్ వంటి సర్వీసుల ద్వారా కూడా ఆపిల్ రికార్డు స్థాయిలో $30.01 బిలియన్లను గడించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ వాడుతున్న వారి సంఖ్య 250 కోట్లకు (2.5 Billion) చేరిందని సీఈవో టిమ్ కుక్ గర్వంగా ప్రకటించారు. “ఐఫోన్ 17కు వస్తున్న డిమాండ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అన్ని దేశాల్లోనూ మా ఫోన్ల అమ్మకాలు అంచనాలను మించిపోయాయి” అని ఆయన పేర్కొన్నారు.

వచ్చే ఫిబ్రవరిలోనే ఆపిల్ తన పర్సనల్ అసిస్టెంట్ ‘సిరి’ని సరికొత్త AI రూపంలో లాంచ్ చేయబోతోంది. దీని కోసం గూగుల్‌తో చేతులు కలిపిన ఆపిల్, గూగుల్ Gemini AI పవర్ ను సిరిలో వాడబోతోంది. రానున్న రోజుల్లో సిరిని ఒక పూర్తి స్థాయి చాట్‌బాట్‌గా మార్చే ప్లాన్‌లో ఆపిల్ ఉంది.

ఐఫోన్ అమ్మకాలు అదిరిపోయినా.. ఏఐ డేటా సెంటర్ల వల్ల ర్యామ్ (RAM) ధరలు పెరగడం కంపెనీ లాభాల మార్జిన్లపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని టిమ్ కుక్ సూచించారు.

Also Read :