Telangana AP Cable Bridge: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపేలా కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక ‘ఐకానిక్ వంతెన’ నిర్మాణానికి సంబంధించి ఒక కీలక అడుగు పడింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ శాఖ అనుమతులు ఎట్టకేలకు మంజూరయ్యాయి. సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ఈ ప్రాజెక్టు, రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేయనుంది.
నేషనల్ హైవే-167కే విస్తరణలో భాగంగా సుమారు 60 ఎకరాల అటవీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం మళ్లించాల్సి ఉంది. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించిన సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. కొన్ని షరతులతో కూడిన ‘స్టేజ్-1’ అనుమతులను మంజూరు చేసింది. అటవీ భూమిని రోడ్డు కోసం వాడుకుంటున్నందున, దానికి బదులుగా మరో ప్రాంతంలో మొక్కలు నాటి అడవిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే, ఇది దేశంలోనే మొట్టమొదటి ‘కేబుల్ స్టేడ్-కమ్-సస్పెన్షన్ బ్రిడ్జి’. అంటే కేబుల్స్ ఆధారంగా గాలిలో తేలుతున్నట్లు కనిపించే ఈ వంతెన ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు వరకు ఈ వంతెనను నిర్మిస్తారు. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన నిర్మాణంతో పర్యాటక రంగానికి కూడా కొత్త కళ రానుంది.
ప్రయాణ సమయం ఆదా.. పర్యాటకానికి ఊతం
ఈ ఐకానిక్ వంతెన అందుబాటులోకి వస్తే సామాన్య ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుంది:
దూరం తగ్గుతుంది: హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు సుమారు 80 కిలోమీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గుతుంది.
టూరిజం డెవలప్‌మెంట్: నల్లమల అడవులు, శ్రీశైలం బ్యాక్ వాటర్స్, సోమశిల సిద్ధేశ్వర ఆలయం వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతుంది.
వ్యూ పాయింట్లు: వంతెనపై నిర్మించే ప్రత్యేక వ్యూ పాయింట్ల నుంచి కృష్ణా నది అందాలను తిలకించే అవకాశం ఉంటుంది.
ఈ వంతెన డిజైన్‌ను మన స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా, ఆలయ గోపురాకృతిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, తెలుగు రాష్ట్రాల మధ్య ఒక చారిత్రక కట్టడంగా మిగిలిపోనుంది. రాయలసీమ తెలంగాణ జిల్లాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడటమే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.
