ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని, సాంకేతిక కారణాలతోనో లేదా ఇతర సమస్యల వల్లనో ఎవరికైనా సాయం అందకపోతే ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. అర్హత ఉండి కూడా డబ్బులు రాని వారు తమ వివరాలను అందిస్తే, వెంటనే పరిశీలించి నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు.
శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ.. యూడైస్ (U-DISE) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 84.27 శాతం మందికి ఇప్పటికే పథకాన్ని వర్తింపజేశామని తెలిపారు. మొత్తం 67.01 లక్షల మంది విద్యార్థులకు రూ. 8,454 కోట్ల రూపాయలను ప్రభుత్వం నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి పంపినట్లు వివరించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం అత్యధిక శాతం మందికి పారదర్శకంగా సాయం అందిస్తోందని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
వైసీపీ హయాంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి కేవలం 52 శాతం మందికే సాయం అందించారని లోకేష్ విమర్శించారు. ఏటా లబ్ధిదారుల సంఖ్యను కుదించడం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. కానీ, తమ ‘ప్రజా ప్రభుత్వం’ వచ్చిన తర్వాత అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, అందుకే ఎక్కడా కోతలు లేకుండా అత్యధిక మందికి ఈ పథకాన్ని చేరువ చేశామని ఆయన పేర్కొన్నారు.
కేవలం సాధారణ విద్యార్థులకే కాకుండా, సమాజం కోసం కష్టపడే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి లోకేష్ వెల్లడించారు. సోషల్ వెల్ఫేర్ విభాగం ద్వారా కేంద్ర నిధులను సమన్వయం చేసుకుంటూ, నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడైనా నిధుల విడుదలలో ఆలస్యం జరిగితే, ఆ లోపాలను సరిదిద్ది సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యా రంగంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కూడా మంత్రి మాట్లాడారు. ఏపీలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను (EMC) ప్రోత్సహిస్తామని, విశాఖపట్నం వంటి నగరాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్న ‘డబుల్ ఇంజన్’ సర్కార్ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
