AP Egg Prices: యుద్ధం దెబ్బ.. కోడిగుడ్డు అబ్బా! ఇజ్రాయెల్ పోరుతో పౌల్ట్రీ రంగానికి భారీ నష్టం.!!

AP Egg Prices

AP Egg Prices

Poultry Farmers Crisis: ఆంధ్రప్రదేశ్‌లో కోడిగుడ్ల ధరలు ఊహించని విధంగా పడిపోతున్నాయి. సామాన్యుడికి ఇది ఊరటనిచ్చే విషయమే అయినా, పౌల్ట్రీ రైతులు మాత్రం తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న ధరలు, ఒక్కసారిగా సగానికి పైగా పడిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోడిగుడ్ల ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మన రాష్ట్రంలోని కోడిగుడ్డు మార్కెట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ రవాణా మార్గాలపై ఆంక్షలు విధించారు. దీంతో చెన్నై పోర్టు ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల రాష్ట్రంలో నిల్వలు పెరిగిపోయి, స్థానికంగా ధరలు దారుణంగా పడిపోయాయి.

నిజానికి గత ఏడాది డిసెంబర్‌లో వంద కోడిగుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.678 వరకు పలికింది. అప్పట్లో ఒక్కో గుడ్డు రిటైల్ మార్కెట్‌లో ఎనిమిది రూపాయల వరకు అమ్ముడైంది. కానీ ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రకటించిన ధరల ప్రకారం, ప్రస్తుతం 100 గుడ్ల హోల్‌సేల్ ధర రూ.420 కి పడిపోయింది. అంటే ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.4.20 పైసలుగా ఉంది. బయట మార్కెట్‌లో ఇవి ఐదు రూపాయల నుండి ఆరు రూపాయల లోపే దొరుకుతున్నాయి. కొన్ని చోట్ల అయితే రూ.3.50 కి కూడా అమ్ముతున్నట్లు సమాచారం.

ధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ సుమారు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇందులో సగం మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తారు, మిగిలిన సగం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పుడు ఎగుమతులు ఆగడంతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ తగ్గడంతో రైతులు అయోమయంలో పడ్డారు. కోళ్ల మేత ధరలు పెరగడం, మరోవైపు గుడ్ల ధరలు తగ్గడంతో పెట్టుబడి కూడా రావడం లేదని పౌల్ట్రీ యజమానులు వాపోతున్నారు. యుద్ధ మేఘాలు తొలగి, రవాణా మార్గాలు సాధారణ స్థితికి వస్తే తప్ప తమకు గండం గడవదని వారు ఆశిస్తున్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.