టీ20 ప్రపంచకప్ 2026కు( T20 World Cup 2026 )సంబంధించిన ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతోంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలతో ఎంతో సంతోషంతో ఎదురుచూస్తున్నారు. ఈసారి ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటంతో మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇలా కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ 2026లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 300కు పైగా పరుగులు సాధించే సత్తా కలిగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధునిక టీ20 క్రికెట్లో బ్యాటింగ్ శక్తి గణనీయంగా పెరుగుతుంది అని , సరైన రోజు కుదిరితే 300 పరుగులు సాధించడం సాధ్యం అని తెలిపారు.
భారత జట్టు విషయానికి వస్తే, స్వదేశంలో ఆడటం పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకూ భారత్ వద్ద విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. ఒకవేళ టాప్ ఆర్డర్‌లోని ఆటగాళ్లు శతకాలు సాధిస్తే, భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రవిశాస్త్రి పేర్కొన్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలో కూడా టీమిండియా సమతుల్యంగా కనిపిస్తోందని అన్నారు.
అలాగే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌పై ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుందని, కానీ ఆ ఒత్తిడిని సరిగ్గా ఎదుర్కొంటే బ్యాక్ టు బ్యాక్ ప్రపంచకప్‌లు గెలిచే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఫీల్డింగ్‌లో తప్పిదాలు లేకుండా, స్పష్టమైన వ్యూహంతో ఆడితే భారత్‌ను ఆపడం కష్టమేనని విశ్లేషించారు.
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కూడా బలమైన బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగుతోంది. ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్ వంటి పవర్ హిట్టర్లు ఆసీస్ జట్టుకు ప్రధాన బలం. ఈ ఆటగాళ్లు ఫామ్‌లో ఉంటే 300 పరుగుల మార్క్‌ను దాటడం ఆశ్చర్యం కాదని రవిశాస్త్రి స్పష్టం చేశారు.
మొత్తానికి, టీ20 ప్రపంచకప్ 2026లో భారీ స్కోర్లు, కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి ఏ జట్టు చరిత్ర సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
