NEET UG 2026 Registration: నీట్ యూజీ 2026.. అప్లై చేయడానికి ఈరోజే ఆఖరు వెంటనే అప్లై చేసుకోండి!

NEET UG 2026 Registration

NEET UG 2026 Registration

డాక్టర్ కావాలనే కలను నిజం చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఇది కీలక సమయం. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్ యూజీ 2026’ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రోజు రాత్రి 9 గంటల వరకు మాత్రమే అభ్యర్థులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

సాధారణంగా గడువు ముగిసే సమయానికి వెబ్‌సైట్‌పై ఒత్తిడి పెరిగి సర్వర్లు మొరాయించే అవకాశం ఉంటుంది. అందుకే ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా, అప్లికేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియను కూడా నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.1700, ఇతరులు వారి కేటగిరీని బట్టి నిర్ణీత రుసుము చెల్లించాలి.

ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షను మే 3వ తేదీన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో పెన్ను, పేపర్ విధానంలో (ఆఫ్‌లైన్) ఈ పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 13 భాషల్లో (తెలుగుతో సహా) పరీక్ష రాసే వెసులుబాటు కల్పించారు. పరీక్ష పూర్తయిన కొన్ని వారాల్లోనే ఫలితాలను విడుదల చేసేలా ఎన్‌టీఏ కసరత్తు చేస్తోంది.

ఈసారి దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. అభ్యర్థులు తమ లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో ఆధార్‌లోని వివరాలతో సరిపోలడం ముఖ్యం. ఒకవేళ ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపుతో ఉత్తీర్ణులైన వారు లేదా ప్రస్తుతం సెకండ్ ఇయర్ రాస్తున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. కనీసం 17 ఏళ్ల వయస్సు నిండి ఉండాలనే నిబంధనను గుర్తుంచుకోవాలి.

ఏటా నీట్ పరీక్షకు పోటీ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో, సొంతంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమయం తక్కువగా ఉన్నందున, ఆఖరి నిమిషంలో టెన్షన్ పడకుండా వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లికేషన్ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని సబ్మిట్ చేయడం ఉత్తమం.