Barking News: అర్థరాత్రి కవిత దీక్ష భగ్నం.. బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు!

Kalvakuntla Kavitha Arrest

Kalvakuntla Kavitha Arrest

Kalvakuntla Kavitha Arrest: ఖమ్మం నగరం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, బాధితులకు మద్దతుగా నిలిచిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. వందలాది మంది పోలీసుల పహారా మధ్య ఆమెను బలవంతంగా వాహనంలో ఎక్కించి హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన పెనుగులాటతో ఖమ్మంలో యుద్ధ వాతావరణం కనిపించింది.

అసలు వివాదం వెలుగుమట్ల సర్వే నంబర్ 90లోని భూములకు సంబంధించింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలను, అవి ప్రభుత్వ భూములని చెబుతూ అధికారులు ఇటీవల ఖాళీ చేయించారు. ఇళ్లను కూల్చివేయడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత సోమవారం రాత్రి నుంచి నిరాహార దీక్షకు దిగారు. బాధితులకు పక్కా ఇళ్లు ఇచ్చే వరకు తాను కదిలేది లేదని ఆమె భీష్మించుకోవడంతో అర్ధరాత్రి వేళ ఉత్కంఠ నెలకొంది.

పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సుమారు 600 మంది పోలీసు బలగాలు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టాయి. తెల్లవారుజామున 6 గంటల సమయంలో నిరసనకారులను చెల్లాచెదురు చేసి కవితను అదుపులోకి తీసుకున్నారు. ఈ తోపులాటలో ఒక మహిళా కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. తనను అరెస్ట్ చేసినా పోరాటం ఆపేది లేదని, జైలు నుంచైనా దీక్ష కొనసాగిస్తానని కవిత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు ప్రభుత్వం ఈ ఆరోపణలను తిప్పికొట్టింది. ప్రభుత్వ భూములను ఆక్రమించి అమాయక పేదలకు కొందరు నాయకులు అక్రమంగా కట్టబెట్టారని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, కానీ అక్రమ కట్టడాలను అనుమతించే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నాయని వారు మండిపడ్డారు.

ప్రస్తుతం ఖమ్మంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కవితను హైదరాబాద్‌కు తరలిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పలుచోట్ల నిరసనలకు పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. వెలుగుమట్ల బాధితుల సమస్య పరిష్కారం అవుతుందా లేక ఈ భూ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంటుందా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.