ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లే చిన్నారులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పిల్లల్లో కనిపిస్తున్న పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా, ప్రస్తుతం అమలులో ఉన్న ఆహార మెనూలో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా ఒకే రకమైన ఆహారం తిని బోర్ ఫీల్ అవుతున్న పిల్లల కోసం, వారి అభిరుచులకు అనుగుణంగా సరికొత్త వంటకాలను అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
ముఖ్యంగా ఇప్పటివరకు అంగన్‌వాడీల్లో వారానికి రెండుసార్లు పులిహోరను అందిస్తుండగా, ఇకపై దాని స్థానంలో నోరూరించే ‘ఎగ్ ఫ్రైడ్ రైస్’ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ వంటకాన్ని వారానికి రెండు రోజులు వడ్డించనున్నారు. దీనివల్ల రుచితో పాటు గుడ్డులోని ప్రొటీన్లు నేరుగా చిన్నారులకు అందుతాయని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం భోజనం మాత్రమే కాకుండా, అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) లో కూడా మార్పులు చేస్తూ.. ఉడికించిన శనగలను మెనూలో చేర్చారు.
వయస్సు వారీగా పిల్లలకు అందించే ‘బాలమృతం’ పంపిణీలో కూడా ప్రభుత్వం స్పష్టమైన మార్పులు తెచ్చింది. 7 నెలల నుండి 12 నెలల వయసున్న చిన్నారుల కోసం ‘జూనియర్ బాలామృతం’, అలాగే 13 నెలల నుండి 36 నెలల వయసున్న వారి కోసం ‘సీనియర్ బాలామృతం’ పేరుతో ప్రత్యేక పోషకాహార పౌడర్‌ను పంపిణీ చేయనున్నారు. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా ఆశ వర్కర్ల చిరకాల కోరికైన జీతాల పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూల సంకేతాలిచ్చింది. ఇటీవల శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం ఎంతో సానుభూతితో ఉందన్నారు. కార్యకర్తల వేతనాల పెంపు అంశం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. దీంతో అంగన్‌వాడీ సిబ్బందిలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల్లో వసతుల కల్పనతో పాటు ఆహార నాణ్యత పెంచడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త మెనూ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమల్లోకి రానుంది.
