Gas Booking New Rules 2026: సామాన్యుడికి గ్యాస్ సెగ.. బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ పెంచుతూ కేంద్రం సంచలన నిర్ణయం.!!

Gas Booking New Rules 2026

Gas Booking New Rules 2026

Gas Booking New Rules 2026: దేశవ్యాప్తంగా సామాన్యుడికి గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. దేశంలో నెలకొన్న గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని, ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ నియమాల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం ఏకంగా 45 రోజులు వేచి చూడక తప్పదు.

గతంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 21 రోజుల తర్వాత రెండోది బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో దానిని ఇటీవల 25 రోజులకు పెంచారు. ఇప్పుడు దేశంలో గ్యాస్ సంక్షోభం మరింత ముదరడంతో, ఈ వెయిటింగ్ పీరియడ్‌ను ఏకంగా 45 రోజులకు పెంచుతూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి లోక్‌సభలో ప్రకటించారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా, సాధారణ వినియోగదారులకు మాత్రం ఇది పెద్ద దెబ్బేనని చెప్పాలి.

కేవలం గృహ అవసరాలకే కాకుండా, వాణిజ్య రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ లేక ఇప్పటికే అనేక నగరాల్లో చిన్న చిన్న హోటళ్లు, ఫుడ్ స్టాల్స్ మూతపడుతున్నాయి. దీనివల్ల హోటల్ రంగంలో పనిచేసే వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌పై ఆధారపడే డెలివరీ బాయ్స్ కూడా పనిలేక ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగా విదేశాల నుంచి గ్యాస్ దిగుమతులు తగ్గడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యుద్ధం ముగిసినా సరే, పరిస్థితి మళ్లీ మామూలు స్థితికి రావడానికి కనీసం కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం కంపెనీలను ఆదేశించినప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది.
గ్యాస్ కొరత మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజలు అందుబాటులో ఉన్నప్పుడే పొదుపుగా వాడుకోవాలని, తదుపరి బుకింగ్ గడువును దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.