AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. రానున్న ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టనుంది. సుమారు 60 ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ‘మెగా జాబ్ క్యాలెండర్’ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనివల్ల ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది యువతకు పెద్ద ఊరట లభించనుంది.
ముఖ్యంగా విద్యా శాఖలో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. డీఎస్సీ (DSC) ద్వారా సుమారు 3,000 కంటే ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయిందని, పాఠశాలల్లో ఖాళీల వివరాలను సేకరించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారబోతోంది.
ఇక గ్రూప్స్ ఉద్యోగాల విషయానికి వస్తే, ఏపీపీఎస్సీ ద్వారా కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-1 విభాగంలో 101 పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 470 పోస్టులు ఈ క్యాలెండర్‌లో ఉండనున్నాయి. అలాగే, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా మరో 1,000 పోలీసు పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
కేవలం ప్రభుత్వ శాఖలే కాకుండా, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా ఈ జాబ్ క్యాలెండర్‌లో చేర్చడం విశేషం. ఉన్నత విద్యారంగంలో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవన్నీ కాకుండా మరికొన్ని చిన్న చిన్న విభాగాల్లోని ఖాళీలను కలిపి మొత్తంగా 10 వేలు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ విభాగానికి ఎన్ని కేటాయిస్తారు అనే విషయంపై మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే, ఉగాది రోజున అధికారికంగా ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉండనుంది. ఎన్నికల హామీలు, నిరుద్యోగ యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
