టాలీవుడ్లో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. ఈ వేదికపై దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంపై వస్తున్న విమర్శలకు హరీష్ శంకర్ సూటిగా సమాధానమిచ్చారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదట ‘ఖుషి’ చిత్రానికి సీక్వెల్లా ఉంటుందని, కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇగో ఉన్న ఇద్దరు లెక్చరర్ల కథతో ప్లాన్ చేశామని ఆయన వెల్లడించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, అలాగే కోవిడ్ ప్రభావం వల్ల కథను మార్చాల్సి వచ్చిందని చెప్పారు. సినిమా ఆలస్యానికి తానే కారణమని ఒప్పుకుంటూనే, తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కోవిడ్ సమయంలో నేను మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నాను. ఆ సమయంలో నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి, ధైర్యం చెప్పి షూటింగ్ ప్లాన్ చేసుకోమని చెప్పారు. ఆయన ఇచ్చిన ఆ భరోసాయే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది” అని అన్నారు. పగలు ప్రజా సేవలో ఉంటూనే, రాత్రుళ్లు ఏమాత్రం అలసిపోకుండా షూటింగ్లో పాల్గొని పవన్ తన నిబద్ధతను చాటుకున్నారని కొనియాడారు.
సినిమా హైలైట్స్ గురించి చెబుతూ.. ఈసారి అభిమానులు కోరుకునే పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని హామీ ఇచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని చెప్పారు. హీరోయిన్ శ్రీలీల కేవలం డ్యాన్స్‌లకే పరిమితం కాకుండా, ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తుందని హరీష్ పేర్కొన్నారు. అలాగే గబ్బర్ సింగ్‌లో “కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు” అన్న డైలాగ్‌ను ఇప్పుడు “కమిట్మెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటుంది” అని మార్చుకున్నట్లు ఆయన చెప్పారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. “ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది అవుతుంది” అంటూ థియేటర్లలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూడబోతున్నారని ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించారు. పవన్ కళ్యాణ్ తన గుండె లోపల, బయట, తన ధైర్యంగా ఎప్పటికీ ఉంటారని చెబుతూ హరీష్ శంకర్ తన ప్రసంగాన్ని ముగించారు.
