ఈ ఐపీఎల్ 2026 సీజన్ కేవలం పరుగుల వరదకే పరిమితం కాకుండా, బౌలింగ్ దిగ్గజాల అరుదైన మైలురాళ్లకు వేదిక కాబోతోంది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ 19వ సీజన్‌లో ముగ్గురు స్టార్ బౌలర్లు తమ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘200 వికెట్ల క్లబ్’ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు లీగ్ చరిత్రలో కేవలం యుజ్వేంద్ర చహల్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు అతని సరసన చేరేందుకు భువనేశ్వర్ కుమార్, సునీల్ నరైన్ జస్ప్రీత్ బుమ్రా పోటీ పడుతున్నారు.
అందరికంటే ముందుగా ఈ రికార్డును అందుకునే అవకాశం టీమిండియా స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ కి ఉంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న భువీ, 200 వికెట్ల మార్కును చేరుకోవడానికి కేవలం రెండు వికెట్ల దూరంలోనే ఉన్నారు. తన 190 మ్యాచ్‌ల అనుభవంతో, సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఈ మైలురాయిని అధిగమించడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక భారతీయుడిగా భువీకి ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ వెన్నెముక, స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ కూడా ఈ రేసులో దూసుకుపోతున్నారు.
ఆయన ఈ ఘనత సాధించడానికి మరో 8 వికెట్లు అవసరం. వికెట్లు తీయడమే కాకుండా, అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంలో నరైన్‌కు సాటిలెవరు. ఈ సీజన్‌లో గనుక ఆయన 200 వికెట్లు పూర్తి చేస్తే, ఐపీఎల్ చరిత్రలో ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన మొట్టమొదటి విదేశీ బౌలర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. కేకేఆర్ అభిమానులు ఆయన మ్యాజిక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ముంబై ఇండియన్స్ గన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం ఈ జాబితాలో నిలవడం విశేషం.
ప్రస్తుతం 183 వికెట్లతో ఉన్న బుమ్రా, 200 మార్కును చేరాలంటే ఈ సీజన్‌లో 17 వికెట్లు తీయాల్సి ఉంది. డెత్ ఓవర్లలో బుమ్రా వేసే యార్కర్ల ధాటికి 17 వికెట్లు తీయడం పెద్ద అసాధ్యమేమీ కాదు. ఆయన ఉన్న ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, సీజన్ ముగిసేలోపు చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా టాప్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ 2026 ఐపీఎల్ సీజన్ బౌలర్ల ఆధిపత్యానికి నిదర్శనంగా నిలవనుంది. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే, ఈ ముగ్గురు దిగ్గజాలు మాత్రం తమ అనుభవంతో వికెట్లు పడగొట్టి కొత్త చరిత్రను లిఖించాలని కంకణం కట్టుకున్నారు. చహల్ (221 వికెట్లు) రికార్డును వీరు ఎంతవరకు సవాల్ చేస్తారో చూడాలి.
