Iran vs Israel War 2026: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు. ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా సైనికులకు తీవ్ర గాయాలు..!!

Iran vs Israel War 2026

Iran vs Israel War 2026

Iran vs Israel War 2026: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై జరిపిన దాడులకు ప్రతిచర్యగా.. ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఏడు దేశాల్లో విస్తరించి ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేపట్టిన ఈ ప్రతీకార దాడుల్లో సుమారు 200 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

క్షిపణి, డ్రోన్ దాడులతో వణికిన సైనిక స్థావరాలు
గత కొన్ని రోజులుగా ఇరాన్ సరిహద్దులు దాటి మరీ అమెరికా బలగాలపై దాడులు చేస్తోంది. ప్రధానంగా బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడుల తీవ్రత మార్చి నెలలో మరింత పెరిగింది. మార్చి 10 నాటికి గాయపడిన వారి సంఖ్య 140 ఉండగా, అది ఇప్పుడు 200కు చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

గాయపడిన 200 మంది సైనికుల్లో అత్యధికులు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 180 మంది ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరారు. అయితే, మరో 10 మంది సైనికుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మిగిలిన 10 మంది సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఈ దాడులు అమెరికా సైనిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ భీకర పోరులో ఇప్పటివరకు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు ఇరాన్ జరిపిన ప్రత్యక్ష దాడుల్లో మరణించగా, మరో ఆరుగురు ఇరాక్‌లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో కన్నుమూశారు. యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాకుండా, వ్యూహాత్మక దాడుల రూపంలో సైనికుల ప్రాణాలను బలితీసుకుంటోంది. అమెరికా తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నప్పటికీ, ఇరాన్ ప్రయోగిస్తున్న ‘ప్లాస్టిక్ డ్రోన్లు’ రడార్లకు చిక్కకుండా వచ్చి దాడులు చేయడం పెను సవాలుగా మారింది.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు జరపడంతో ఈ గొడవ మొదలైంది. ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు వార్తలు రావడంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. అందుకే అరబ్ దేశాల్లోని అమెరికా ఆస్తులు, సైనికులే లక్ష్యంగా టెహ్రాన్ తన అమ్ములపొదిలోని క్షిపణులను ప్రయోగిస్తోంది. శాంతి చర్చలు జరుగుతున్నాయని పైకి చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం బాంబుల మోత ఆగడం లేదు.