AP Gas Cylinder Delivery: ఏపీ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. 36 గంటల్లోనే ఇంటికి సిలిండర్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

AP Gas Cylinder Delivery

AP Gas Cylinder Delivery

AP Gas Cylinder Delivery: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్ (LPG) సరఫరాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్న తర్వాత, కేవలం ఒకటిన్నర రోజు (36 గంటలు) లోపే డెలివరీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా రాష్ట్రంలోని గ్యాస్ నిల్వలు, పంపిణీ తీరుపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు తావుండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా గృహ అవసరాలకు వాడే సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. “సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే సహించేది లేదు. పంపిణీ ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలి. ఇందుకోసం సాంకేతికతను విరివిగా ఉపయోగించాలి” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఓటీపీ విధానం ద్వారానే అర్హులకు గ్యాస్ అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రముఖ దేవాలయాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని సీఎం ఆదేశించారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అన్న క్యాంటీన్ల’కు కూడా నిరంతరాయంగా గ్యాస్ అందించాలని చెప్పారు. హోటళ్లు, వాణిజ్య సంస్థల్లో గృహ వినియోగ సిలిండర్ల వాడకాన్ని తగ్గించేందుకు సంబంధిత అసోసియేషన్లతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, దీనివల్ల సిలిండర్ల కోసం వేచి చూసే ఇబ్బంది తప్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల వాడకం వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని కోరారు.
యుద్ధం వంటి విదేశీ సంక్షోభ పరిస్థితుల వల్ల సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే, వాటిని తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 17,209 టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని, 1,154 ఏజెన్సీల ద్వారా పంపిణీ జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. డెలివరీ సమయంలో ఓటీపీ లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, ప్రజలు తమ సమీపంలోని ‘స్వర్ణ గ్రామం’ లేదా ‘స్వర్ణ వార్డు’ కార్యాలయాలను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యాలయాల ద్వారా సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ఆర్టీజీఎస్ (RTGS) నుంచి సాంకేతిక సహకారం అందిస్తామని అధికారులు వెల్లడించారు.