ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విలువల పతనం పరాకాష్టకు చేరుకుంది. మాటలు తూటాల్లా పేలడం సహజమే కానీ, అవి అసభ్యతను, సంస్కారహీనతను ప్రతిబింబిస్తేనే ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. నాడు ఒక పదానికి అర్థం వెతికి మరీ దాడులకు తెగబడ్డ వైసీపీ నేతలు, నేడు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిని దూషిస్తున్నా సమర్థించుకోవడమేంటనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు, వాటికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న భరోసా చూస్తుంటే.. మనకైతే ఒక నీతి.. పక్కవారికైతే మరో నీతా? అన్న సందేహం కలగక మానదు.
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత పట్టాభి వాడిన ఒక పదాన్ని పట్టుకుని వైసీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.’బోస్‌డీకే అనే పదంపై డిక్షనరీలు తిరగేసి, అది జగన్‌ను అవమానించడమేనంటూ రచ్చ చేశారు. విజయవాడలోని పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేసి బీభత్సం సృష్టించిన ఉదంతం ఇప్పటికీ మర్చిపోలేం. అప్పుడు అది జగన్‌కు జరిగిన ఘోర అవమానంగా చిత్రించిన అదే నేతలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అంబటి రాంబాబు బహిరంగంగా అసభ్య పదజాలం వాడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు.
రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న అంబటి రాంబాబు తన స్థాయిని మర్చిపోయి బూతులు మాట్లాడితే, పార్టీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డి ఆయనను మందలించాల్సింది. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. మేమంతా నీకు తోడున్నాం అంటూ భరోసా ఇవ్వడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం ద్వారా కేడర్‌కు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
చంద్రబాబును ఉద్దేశించి ఘోరమైన బూతులు వాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబటి రాంబాబు వంటి నేతలు బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత కలుషితం అవుతోంది. పట్టాభి అన్న పదానికి అర్థం తెలియకపోయినా విధ్వంసం సృష్టించిన వారు, ఇప్పుడు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న బూతు పురాణాన్ని ఎలా సమర్థిస్తారని రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ, అవి వ్యక్తిత్వాన్ని దారితీయకూడదు.
అధికారం ఉన్నా లేకపోయినా హుందాతనం ముఖ్యం. నాడు అధికార బలంతో దాడులకు పాల్పడిన నేతలు, నేడు విమర్శల పేరుతో బూతులు మాట్లాడటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్ తన పద్ధతి మార్చుకోకుండా, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ప్రజల నుంచి మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
