US Iran Conflict : చబహార్ సమీపంలో అమెరికాకు చెందిన F-18 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ IRGC ప్రకటన.

US Iran Conflict

US Iran Conflict

US Iran Conflict : ప్రస్తుతం పశ్చిమాసియా లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తాము ఒక అమెరికన్ F-18 ఫైటర్ జెట్‌ను విజయవంతంగా కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ‘ప్రెస్ టీవీ’ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అయితే, ఈ వాదనలను అమెరికా సైన్యం తీవ్రంగా ఖండించింది.

ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. వారు విడుదల చేసిన వీడియోలో.. ఆకాశంలో ఎగురుతున్న ఒక విమానాన్ని ఏదో ఒక వస్తువు బలంగా తాకడం, ఆ వెంటనే ఆ విమానం నుండి మంటలు రావడం, నియంత్రణ కోల్పోయి విమానం కిందికి పడిపోవడం వంటి దృశ్యాలు ఉన్నాయి.అంతేకాకుండా, గత వారం ఇరాన్ గగనతలంలో నిఘా పెడుతున్న అమెరికాకు చెందిన అత్యంత ఆధునికమైన F-35 స్టెల్త్ ఫైటర్ కూడా తమ దాడిలో దెబ్బతిందని ఇరాన్ క్లెయిమ్ చేసింది. ఆ విమానం తీవ్ర నష్టంతో మధ్యప్రాచ్యంలోని ఒక అమెరికా బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఇరాన్ చెబుతోంది.

ఇరాన్ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ తప్పుబట్టింది. “ఇరాన్ చెబుతున్నవన్నీ అబద్ధాలు. చబహార్ ప్రాంతంలో కొత్త రక్షణ వ్యవస్థతో అమెరికా F-18ను కూల్చామన్న వార్తల్లో నిజం లేదు. మా విమానాలు ఏవీ కూలిపోలేదు” అని స్పష్టం చేసింది. గతంలో కూడా ఇరాన్ ఇలాగే F-15 విమానాలను కూల్చామని తప్పుడు ప్రచారం చేసిందని అమెరికా గుర్తు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించారు. కానీ, అది శత్రువుల దాడి వల్ల జరిగిందా లేదా సాంకేతిక లోపమా అనే దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు.

ఫిబ్రవరి 28, 2026న అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ని ప్రారంభించాయి. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి వ్యవస్థలు, నౌకాదళం అణు మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. దాదాపు నెల రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా ఇప్పటికే వేల సంఖ్యలో యుద్ధ విమాన విన్యాసాలను నిర్వహించింది. యుద్ధ విరామం రాజకీయ ఉత్కంఠ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఒక శాంతి ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచారు.

ఇరాన్ దీనిని తిరస్కరించింది. “మేము చర్చలు జరిపే ప్రసక్తే లేదు” అని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా ప్రతిపాదించిన ఐదు షరతులను కూడా ఇరాన్ తోసిపుచ్చింది. మరోవైపు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. చర్చలు ఇంకా ముగిసిపోలేదని, అవి సానుకూలంగా జరుగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ఇరాన్ ఒకవేళ శాంతికి అంగీకరించకపోతే అధ్యక్షుడు ట్రంప్ మరింత భీకరమైన దాడులకు సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు