India Lockdown News : మళ్ళీ లాక్‌డౌన్ రాబోతోందా? సోషల్ మీడియా వైరల్ వార్తలపై కేంద్రం సంచలన ప్రకటన!

India Lockdown News

India Lockdown News

India Lockdown New : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ‘భారత్‌లో మళ్ళీ లాక్‌డౌన్’ అనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని, ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం స్పష్టం చేశారు. అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అంతా ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాలో కొన్ని ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తోందని ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి అత్యవసర వస్తువుల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.

“దేశంలో లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం ముందు లేదు,” అని మంత్రి తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలని, పుకార్లు పుట్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగించడం చాలా తప్పని ఆయన హెచ్చరించారు. తప్పుడు వార్తలను నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.

ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఇటీవల పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలేనని తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మనం “సిద్ధంగా ఉండాలి” అని ఆయన చెప్పారు. అయితే, ఆ ‘సిద్ధత’ అనేది పాలనాపరమైన ఏర్పాట్లకు సంబంధించిందే తప్ప, ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడానికి కాదని అధికారులు వివరణ ఇచ్చారు. దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని లాక్‌డౌన్ రాబోతోందని ప్రచారం చేశారు.

మరోవైపు, 2020లో ఇదే సమయంలో కరోనా లాక్‌డౌన్ విధించడం వల్ల, ఆ పాత జ్ఞాపకాలతో ప్రజలు మరిన్ని ఆందోళనలకు గురయ్యారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు వేరని, కేవలం ముందస్తు ప్రణాళికలో భాగంగానే ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్రం తేల్చి చెప్పింది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సంయమనం పాటించాలని ప్రభుత్వం కోరింది.