AP Govt E-Bicycle Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ పథకం కింద సామాన్యులకు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకే బ్యాటరీ సైకిళ్లను (E-Bicycles) అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఒక మంచి ఈ-సైకిల్ ధర సుమారు రూ. 35,000 వరకు ఉంది. అయితే సామాన్యులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక్కో సైకిల్‌పై రూ. 10,000 నుండి రూ. 11,000 వరకు భారీ రాయితీని ప్రకటించింది. అంటే కేవలం రూ. 24,000 చెల్లిస్తే చాలు, ఈ బ్యాటరీ సైకిల్ మీ సొంతమవుతుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు విద్యార్థులకు ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.
ఈ సైకిల్ కేవలం చౌకగా రావడమే కాదు, దీని ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకసారి పూర్తిస్థాయిలో ఛార్జింగ్ చేస్తే సుమారు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీనికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతుంది. గరిష్టంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుంది. ఇందులో డిజిటల్ మీటర్ కూడా ఉంటుంది, ఇది బ్యాటరీ ఎంత ఉంది మీరు ఎంత వేగంతో వెళ్తున్నారో చూపిస్తుంది. పైగా, బ్యాటరీని సైకిల్ నుండి విడదీసి ఇంట్లోనే మొబైల్ ఫోన్ లాగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఒకేసారి రూ. 24,000 కట్టలేని వారి కోసం ప్రభుత్వం బ్యాంకు రుణాల సౌకర్యాన్ని కూడా కల్పించింది. కేవలం రూ. 5,000 డౌన్ పేమెంట్ కట్టి సైకిల్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. మిగిలిన మొత్తాన్ని 24 నెలల పాటు సులభ వాయిదాల పద్ధతిలో (EMI) చెల్లించే అవకాశం ఉంది. దీనివల్ల నెలవారీ ఖర్చు పెట్రోల్ ఖర్చు కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ దారిలో ఛార్జింగ్ అయిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు, సాధారణ సైకిల్ లాగా తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఈ రాయితీ సైకిల్ కావాలనుకునే వారు తమకు దగ్గరలోని ‘స్వర్ణ గ్రామ’ లేదా ‘స్వర్ణ వార్డు’ సచివాలయాల్లో సంప్రదించవచ్చు. అలాగే జిల్లాలోని డీఆర్డీఏ (DRDA) కార్యాలయాల్లో కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో పట్టణాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ద్వారా ఈ సైకిళ్లను ఛార్జ్ చేసుకునేలా ప్రోత్సహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరపడి దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
