Hyderabad CNG Shortage: హైదరాబాద్‌లో సీఎన్‌జీ సెగ: 2 కిలోమీటర్ల మేర బారులు తీరిన ఆటోలు!

Hyderabad CNG Shortage

Hyderabad CNG Shortage

Hyderabad CNG Shortage: భాగ్యనగరంలో ఆటో డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం పొందుదామని సీఎన్‌జీ వైపు మొగ్గు చూపిన డ్రైవర్లకు ఇప్పుడు గ్యాస్ దొరకడమే గగనమైపోతోంది. తాజాగా సోమవారం నాడు లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఆటోలు ఏకంగా రెండు కిలోమీటర్ల మేర బారులు తీరడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

నగరంలోని చాలా చోట్ల సీఎన్‌జీ బంకులు మూతపడటం లేదా స్టాక్ లేకపోవడంతో డ్రైవర్లంతా లక్డీకాపూల్ వైపు కదిలారు. లక్డీకాపూల్‌లోని భారత్ పెట్రోల్ బంకులో గ్యాస్ లభ్యత ఉందన్న సమాచారం దావానలంలా వ్యాపించడంతో వందలాది ఆటోలు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నాయి. దీంతో అశోక హోటల్ నుంచి మొదలైన క్యూ.. సైఫాబాద్, రాజ్‌దూత్ చౌరస్తా మీదుగా ఖైరతాబాద్ మార్కెట్ వరకు సాగింది. గంటల తరబడి వేచి ఉన్నా గ్యాస్ దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొనడంతో డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రెండు కిలోమీటర్ల పొడవునా ఆటోలే కనిపించడంతో ఖైరతాబాద్ గల్లీలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రధాన రహదారులతో పాటు లోపలి వీధుల్లో కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానికులు కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేని విధంగా ఆటోలు నిలిచిపోయాయి. అక్కడక్కడ కొందరు డ్రైవర్లు క్యూ లైన్ మధ్యలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.

పరిస్థితి చేయి దాటిపోతుండటంతో సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గొడవలు జరగకుండా ఉండేందుకు క్యూలో ఉన్న వారికి టోకెన్లు పంపిణీ చేశారు. అందరికీ గ్యాస్ అందాలనే ఉద్దేశంతో ఒక్కో ఆటోకు గరిష్టంగా 9 కిలోల గ్యాస్ (సుమారు రూ. 700 విలువైనది) మాత్రమే పోయాలని నిబంధన పెట్టారు. దాదాపు 1,080 ఆటోలకు గ్యాస్ అందించి పరిస్థితిని చక్కదిద్దారు. రెండు ట్యాంకర్ల ద్వారా వచ్చిన 9,800 కిలోల గ్యాస్ కొద్ది సేపట్లోనే నిండుకుంది.

తెల్లవారుజాము నుంచి లైన్లో ఉన్నాం. గ్యాస్ కోసం రోజులో సగం సమయం ఇక్కడే అయిపోతోంది. ఇక మేము సంపాదించేది ఎప్పుడు? ఇంటికి వెళ్లేది ఎప్పుడు?” అంటూ పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో సీఎన్‌జీ వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా ఫిల్లింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం గ్యాస్ కంపెనీలు స్పందించి మరిన్ని బంకులను ఏర్పాటు చేయాలని, సరఫరాను క్రమబద్ధీకరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఒకవైపు ఎండలు ముదురుతుంటే, మరోవైపు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడటం ఆటో డ్రైవర్ల ఆరోగ్యానికి, ఆదాయానికి గండి కొడుతోంది. ఈ ‘గ్యాస్ కష్టాలు’ తీరకపోతే భవిష్యత్తులో ఆటో బంద్ వంటి ఆందోళనలకు దిగుతామని డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.