Stock Market: రూపాయి భారీ పతనం: డాలర్‌తో పోలిస్తే రూ. 95 మార్కు దాటిన విలువ.. ఆందోళనలో ఇన్వెస్టర్లు!

Stock Market

Stock Market

Stock Market: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావమే చూపుతున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రాత్మక పతనంతో రూ. 95 మార్కును దాటేసింది. ఒకానొక దశలో రూ. 95.22 వద్ద ట్రేడ్ అయ్యి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి ఇంతలా దిగజారడం ఇదే తొలిసారి కావడంతో ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికాల మధ్య నడుస్తున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు సరఫరాను ఇరాన్ అడ్డుకుంటుండటంతో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో, డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతోంది. దీని ప్రభావం ఇప్పటికే సామాన్యుడిపై పడటం మొదలైంది. దేశీయంగా వంట గ్యాస్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడమే కాకుండా, పెట్రోల్ ఎగుమతులపై కేంద్రం మళ్లీ విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పార్లమెంటులో నిర్మలమ్మ ధీమా: “మనం సేఫ్”
రూపాయి పతనంపై లోక్‌సభలో ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురవ్వగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలక్షణంగా స్పందించారు. రూపాయి పడిపోవడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. “భారత ఆర్థిక పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ద్రవ్య లోటు నిర్వహణలో మనం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని, మన విదేశీ మారకపు నిల్వలు దేశాన్ని ఆదుకుంటాయని ఆమె భరోసా ఇచ్చారు. కరెన్సీ పతనం అనేది ప్రపంచవ్యాప్త సమస్యే తప్ప ఒక్క భారత్‌కే పరిమితం కాలదని ఆమె విశ్లేషించారు.

నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఆసియాలోని ఇతర ప్రధాన దేశాల కరెన్సీ గణాంకాలను కూడా ఉదహరించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి సౌత్ కొరియా ‘వోన్’ 4.6 శాతం, ఫిలిప్పీన్స్ ‘పెసో’ 4.8 శాతం, థాయ్ ‘బాట్’ 5.5 శాతం చొప్పున పడిపోయాయని వివరించారు. వీటన్నింటితో పోలిస్తే రూపాయి విలువ 4.1 శాతం తగ్గి రూ. 94.60 స్థాయిలో ఉండటం కొంత ఊరట కలిగించే విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతున్నప్పుడు సహజంగానే మిగిలిన కరెన్సీలు బలహీనపడతాయని, అది దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం కాదని మంత్రి తేల్చి చెప్పారు.

ఆర్‌బీఐ రంగంలోకి దిగినా అదుపులోకి రాని పరిస్థితి
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. మార్కెట్లో డాలర్ల కొరత లేకుండా చూసేందుకు బ్యాంకుల ఓపెన్ పొజిషన్స్‌పై కొత్త పరిమితులు విధించింది. ఏప్రిల్ 10 నుంచి అమలులోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు డాలర్లను మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే, సోమవారం ఆర్‌బీఐ జోక్యంతో రూపాయి కొంత పుంజుకున్నట్లు కనిపించినా, ట్రేడింగ్ ముగిసే సమయానికి మళ్లీ అమ్మకాల ఒత్తిడికి గురై ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. యుద్ధం ముగిసి, అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడితే తప్ప రూపాయి మళ్లీ పూర్వస్థితికి రావడం కష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు.