తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ (Telangana Phone Tapping Case ) కేసులో భాగంగా నేడు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ విచారణ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసంలో జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఉదయం 11 గంటల నుంచి అవసరాన్ని బట్టి వాహనాలను మళ్లించే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలియచేశారు . కేసీఆర్ నివాసానికి వెళ్లే మార్గాల్లో భద్రతా చర్యలు పెంచడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయడం లేదా డైవర్ట్ చేయనున్నట్లు వెల్లడి చేసారు . నందినగర్ బస్ స్టాప్, అగ్రసేన్ జంక్షన్, బసవతారకం రోటరీ, ఎన్టీఆర్ భవన్, రోడ్ నంబర్ 12, టీఎస్ స్టడీ సర్కిల్, ఎమ్మార్సీ కమాన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు నందినగర్ నివాసానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సిట్ విచారణ ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే కేసీఆర్ నివాసానికి కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు.
ఈ విచారణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ శాంతియుత నిరసనలకు పిలుపునివ్వడంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అన్ని జిల్లాల ఎస్పీలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్‌లను సిట్ అధికారులు విచారించగా, నేడు కేసీఆర్ విచారణ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సిట్ ఏ ప్రశ్నలు వేస్తుంది? కేసీఆర్ ఎలా స్పందిస్తారు? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
https://varthaprabhanjanam.com/egg-65-recipe-at-home-quick-tasty-snack-for-kids/
