Passport Application Status: మీ పాస్‌పోర్ట్ ఎక్కడి వరకు వచ్చింది? స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా చెక్ చేసుకోండి!

Passport Application Status

Passport Application Status

పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత, అది ఏ దశలో ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. దరఖాస్తు సమర్పించడం నుంచి పాస్‌పోర్ట్ చేతికి వచ్చే వరకు అనేక దశలు ఉంటాయి. డాక్యుమెంట్ల సమర్పణ, అపాయింట్‌మెంట్ బుకింగ్, పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు పూర్తయ్యాకే పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. ఈ అన్ని దశల పురోగతిని మీరు పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా సులభంగా చెక్ చేయవచ్చు.

పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్టేటస్ చెక్ చేయడం ఎలా?

మొదటిగా అధికారిక పాస్పోర్ట్ సేవ్ (Passport Seva) వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో ఉన్న Quick Links విభాగంలో Track Passport Application అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత, Application Type డ్రాప్‌డౌన్ మెనూలో “Passport / PCC / IC / GEP” అనే ఎంపికను సెలెక్ట్ చేయాలి.

ఇప్పుడు మీరు దరఖాస్తు సమయంలో అందిన 15 అంకెల ఫైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ నంబర్ మీకు అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత ఇచ్చే రసీదుపై ఉంటుంది. అనంతరం, మీ డాక్యుమెంట్లలో నమోదు చేసిన పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయాలి.
అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేసిన తర్వాత “Track Application Status” బటన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ పాస్‌పోర్ట్ అప్లికేషన్ ప్రస్తుతం ఏ దశలో ఉందో డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ లేదా డిస్పాచ్ దశ అన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

పాస్‌పోర్ట్ సేవా మొబైల్ యాప్ ద్వారా స్టేటస్ చెక్ చేయడం ఎలా?

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే Google Play Store నుంచి, ఐఫోన్ వాడుతున్నట్లయితే Apple App Store నుంచి Passport Seva App డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో స్టేటస్ చెక్ చేయడానికి లాగిన్ అవాల్సిన అవసరం లేదు.

యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైభాగంలో కనిపించే Status Tracker ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. అక్కడ అప్లికేషన్ టైప్ సెలెక్ట్ చేసి, మీ 15 అంకెల ఫైల్ నంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేయాలి. తర్వాత Track Status పై క్లిక్ చేస్తే, మీ పాస్‌పోర్ట్ అప్లికేషన్‌కు సంబంధించిన తాజా సమాచారం కనిపిస్తుంది. ఈ విధంగా, ఇంటి నుంచే సులభంగా మీ పాస్‌పోర్ట్ అప్లికేషన్, పోలీస్ వెరిఫికేషన్, అలాగే డిస్పాచ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు.