తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా ప్రజలను. అతిగా భయపెట్టిన పెద్దపులి కథకు ఎట్టకేలకు ఈరోజు ముగింపు పలికింది. అటవీ శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో స్థానికులు అందరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. గత ఆరు రోజులుగా పులి సంచారం కారణంగా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు కనీసం బయటకు రావాలి అన్న కూడా భయపడ్డారు. ముఖ్యంగా పశువులపై దాడులు చేయడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు.
పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆపరేషన్ జాక్ పేరుతో చర్యలు ప్రారంభించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు పులి కదలికలను గమనించారు. శుక్రవారం ఉదయం కూర్మాపురం ప్రాంతంలోని పాడుబడిన ఇంట్లో పులి ఉన్నట్లు సమాచారం రావడంతో అటవీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మొదట మత్తు ఇంజెక్షన్ ద్వారా పులిని బంధించే ప్రయత్నం చేశారు. అయితే అధికారులు చేరుకున్న వెంటనే పులి భయపడి పొలాల్లోకి పరుగులు తీసింది.అటవీ శాఖ సిబ్బంది పులిని జాగ్రత్తగా ట్రాక్ చేస్తూ కొత్త చెరువు ప్రాంతంలో మళ్లీ గుర్తించారు. అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఫ్లడ్ లైట్లు వెలిగించారు. వెలుతురు కారణంగా పులి బయటకు రావడంతో రెస్క్యూ బృందం సరైన సమయంలో మత్తు ఇంజెక్షన్ ప్రయోగించింది. ఇంజెక్షన్ ప్రభావంతో పులి మత్తులోకి వెళ్లగా అధికారులు దానిని సురక్షితంగా బోనులో బంధించారు.
బంధించిన పులిని అనంతరం విశాఖపట్నం జంతుప్రదర్శనశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి పులి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. ఈ ఘటనతో గత కొన్ని రోజులుగా భయంతో గడిపిన రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు ఊరట పొందారు.ఈ పులి గతంలో రాజానగరం మండలంలోని భూపాలపట్నంలో ఒక ఆవుపై దాడి చేసింది. అలాగే జి. యర్రంపాలెంలో మరో రెండు పశువులను చంపింది. దీంతో స్థానికులు భయంతో బయటకు రావడానికి కూడా భయపడ్డారు. పులిని పట్టుకోవడానికి పుణె నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని కూడా తీసుకువచ్చారు.
అటవీ శాఖ అధికారులు ప్రజలు అడవుల సమీప ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అడవి జంతువులు గ్రామాల దగ్గరకు వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఈ ఘటనతో అడవి జంతువుల సంరక్షణతో పాటు ప్రజల భద్రత కూడా ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది.ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అటవీ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలిపారు.
