AP Special Trains : ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. బెంగళూరు, మైసూరుకు ప్రత్యేక రైళ్లు

AP Special Trains

AP Special Trains

ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ మంచి వార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం రెండు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి నెలలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల ప్రయాణికులకు ఇవి చాలా ఉపయోగపడతాయి.

మొదటి ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి మైసూరు వరకు నడుస్తుంది. ఈ రైలు నంబర్లు 07033 / 07034. ఈ రైలు మార్చి 2 నుంచి మార్చి 31 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కోస్తా ప్రాంతంలో సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్లలో ఆగుతుంది.

అలాగే తెలంగాణలో మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్ స్టేషన్లలో ఆగుతుంది. తర్వాత రాయలసీమ ప్రాంతంలో మంత్రాలయం, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్లలో ఆగుతుంది. అనంతరం కర్ణాటకలో యలహంక, బెంగళూరు, మాండ్య స్టేషన్లలో ఆగి మైసూరుకు చేరుకుంటుంది.

ఇక రెండో ప్రత్యేక రైలు బెంగళూరు నుంచి నర్సాపూర్ వరకు నడుస్తుంది. ఈ రైలు నంబర్లు 07153 / 07154. ఈ రైలు మార్చి 6 నుంచి మార్చి 28 వరకు నడుస్తుంది. ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. తర్వాత కాట్పాడి, జోలార్‌పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.

ఇదిలా ఉండగా, నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ – డోర్నకల్ (67767 / 67768), విజయవాడ – గుంటూరు (67769 / 67770) రైళ్లు ఫిబ్రవరి 7 మరియు 8 తేదీల్లో రద్దు చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధిపై కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 10 రైల్వే ప్రాజెక్టులను రూ.12,967 కోట్లతో పూర్తి చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.34,680 కోట్లతో 16 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో 15 కొత్త రైల్వే లైన్లు, 50 డబ్లింగ్ లైన్లకు సర్వేలు చేసినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రానికి రూ.70,232 కోట్లతో కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య కొత్త లైన్ నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు వెళ్లే ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది అనే చెప్పుకోవచ్చు.

https://varthaprabhanjanam.com/us-and-india-dismantle-major-online-drug-ring-in-operation-meltdown/