Telangana Farmers Scheme : రైతు భరోసా నిధులపై క్లారిటీ.. కోతలు లేకుండా అందరికీ చెల్లింపు

Telangana Farmers Scheme

Telangana Farmers Scheme

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకం పై మంచి వార్త ప్రకటించింది. గత వానాకాలం సీజన్‌లో రైతు భరోసా పొందిన రైతులందరికీ ఈ యాసంగి సీజన్‌లో కూడా ఎలాంటి కోతలు లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొంతకాలంగా రైతు భరోసా నిధులపై కోతలు ఉంటాయా అనే సందేహం ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే లబ్ధి పొందిన రైతులందరికీ తిరిగి సాయం అందనుంది.

ప్రస్తుతం ప్రభుత్వం శాటిలైట్ సర్వే లింక్ లేకుండా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని ప్రయత్నిస్తోంది. రైతులకు త్వరగా నిధులు చేరేలా చర్యలు తీసుకుంటోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాక కొత్త రైతుల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభించనున్నారు. కొత్తగా నమోదు అయ్యే రైతులకు కూడా తరువాత నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం 2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69 లక్షల పైగా రైతులకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చారు. ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున మొత్తం రూ.8,744 కోట్లకు పైగా నగదు రైతుల ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 1.45 కోట్ల ఎకరాలకు ఈ పథకం వర్తించింది.

కేవలం 9 రోజుల్లోనే ప్రభుత్వం సుమారు రూ.9 వేల కోట్లను రైతులకు పంపిణీ చేసింది. అదే విధంగా ఈ యాసంగి సీజన్‌లో కూడా రైతు భరోసా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ నెల 10వ తేదీన ప్రభుత్వం ఆర్బీఐ నుండి సుమారు రూ.9 వేల కోట్ల రుణం తీసుకుంది. ఈ మొత్తాన్ని రైతు భరోసా పథకానికే ఉపయోగించనున్నట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 16వ తేదీకి పూర్తవుతాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. సంక్రాంతి సమయానికే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావించినా, నిధుల సర్దుబాటు మరియు ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది. ఈ నెలలోనే మొత్తం చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత సీజన్ తర్వాత భూముల కొనుగోలు, అమ్మకాలు జరిగాయి. అలాగే కొత్త రైతులకు పట్టాదారు పాస్‌బుక్స్ జారీ అయ్యాయి. ఇవన్నీ యాసంగి సీజన్‌లో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త రైతుల నమోదు కోసం ఇంకా అధికారిక ఆదేశాలు రాలేదు. గత సంవత్సరం జనవరి 1 తేదీని కట్ ఆఫ్‌గా తీసుకున్నారు. ఈసారి ఏ తేదీ తీసుకుంటారో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మొత్తం మీద గత సీజన్‌లాగే ఈసారి కూడా సుమారు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు త్వరలోనే డబ్బులు అందే అవకాశం ఉంది.

https://varthaprabhanjanam.com/ap-rte-admissions-2026-free-seats-in-private-schools-apply-from-feb-20/