ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షలు మార్చి 24 వరకు కొనసాగుతాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఈసారి ఇంటర్ బోర్డు ఒక ముఖ్యమైన నిబంధనను అమలు చేస్తోంది. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అందుకే విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ లేదా ఇతర కారణాలతో ఆలస్యం కాకుండా ముందుగానే బయలుదేరాలని తల్లిదండ్రులకు కూడా సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నారు. కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, అవసరమైన వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు.
మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. అక్కడి నుంచి పరీక్షలను నేరుగా పర్యవేక్షిస్తారు. ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, విద్యార్థులకు హాల్ టికెట్లు తప్పనిసరిగా ఇవ్వాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే చాలా కాలేజ్లో పిల్లలు ఫీస్ కట్ట లేదు అని హాల్ టికెట్ ఇవ్వను అని అంటారు. కానీ ఈసారి ఆ బాధ నుండి తపుకున్నారు. ఫీజులు చెల్లించకపోయినా హాల్ టికెట్ ఇవ్వకుండా ఆపకూడదని స్పష్టం చేశారు. ఫీజులు, హాల్ టికెట్లను కలిపి చూడొద్దని తెలిపారు. ఒకవేళ ఏ కాలేజీ అయినా విద్యార్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
మొత్తంగా చూస్తే, ఈసారి ఇంటర్ పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. విద్యార్థులు సమయానికి కేంద్రానికి చేరుకుని, నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
