కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న హై టెన్షన్ కు తెరపడుతూ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత కీలకమైన ఈ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. వాస్తవానికి స్థానిక పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చి మేయర్ పీఠం దక్కేలా చేయాలని భావించినప్పటికీ, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మొత్తం సీన్ మార్చేసింది.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాయని వస్తున్న వార్తలపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే భవిష్యత్తులో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అడుగులు వేయడం సరికాదు అంటూ గంగులకు క్లాస్ పీకినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి లొంగిపోవడం కంటే, రాజకీయంగా తటస్థంగా ఉండటమే ప్రస్తుతానికి శ్రేయస్కరమని ఆయన స్పష్టం చేయడంతో కరీంనగర్ గులాబీ శ్రేణులు ఒక్కసారిగా డైలమాలో పడ్డాయి.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉండగా, మేయర్ ఎన్నికకు కావలసిన సంఖ్యాబలం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం బీజేపీ బలం 34 కు చేరుకుంది, ఇందులో ఆ పార్టీ కార్పొరేటర్లతో పాటు కొందరు స్వతంత్రులు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతు కూడా తోడైంది. మెజారిటీ మార్కును దాటడానికి బీజేపీకి ఈ బలం సరిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో, సభలో హాజరయ్యే సభ్యుల సంఖ్య తగ్గుతుంది. తద్వారా మేయర్ ఎన్నికకు కావలసిన కోరం మరియు మెజారిటీ లెక్కలు బీజేపీకి అనుకూలంగా మారడం వల్ల పీఠం దక్కించుకోవడం ఆ పార్టీకి సులభతరమైంది.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో ఎలాగైనా పైచేయి సాధించాలని గట్టి ప్రయత్నాలే చేసింది. బీఆర్ఎస్ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని ఆ పార్టీ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ అనూహ్యంగా ‘న్యూట్రల్’ (తటస్థ) వైఖరిని ప్రకటించడంతో కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయి. సొంతంగా మెజారిటీ లేని కారణంగా, బీఆర్ఎస్ మద్దతు లేని పక్షంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. దీంతో కరీంనగర్ కార్పొరేషన్‌లో అధికారం చేపట్టాలన్న కాంగ్రెస్ కల కరిగిపోయింది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పట్టును కొంతవరకు బలహీనపరిచినట్లు కనిపిస్తోంది.
Also Read :
