రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా( AP Budget 2026 ) ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తన బడ్జెట్ రూపకల్పనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఎస్సీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేపట్టింది. పిల్లలకు అమ్మలా, ఇల్లు లేని పేదలకు పెద్దన్నలా అండగా నిలుస్తూ.. సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 743 సంక్షేమ వసతి గృహాలు (హాస్టళ్లు), రెసిడెన్షియల్ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. విద్యార్థులు తమ సొంత ఇంట్లో ఉన్నంత హాయిగా సురక్షితంగా ఉన్నప్పుడే చదువుపై ఏకాగ్రత చూపగలరనే ఉద్దేశంతో ఈ హాస్టళ్లకు కొత్త రూపునిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా రూ. 300 కోట్లు కేటాయించింది. ప్రతి హాస్టల్‌లో శుద్ధి చేసిన తాగునీరు, వినోదం కోసం టీవీలు, విద్యార్థుల భద్రత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ‘రియల్ టైమ్ మానిటరింగ్’ వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులతో ఈ హాస్టళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
పేదవాడి సొంతింటి కల కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. ఆ కలను సాకారం చేయడంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పీఎంఏవై పథకం కింద మంజూరయ్యే నిధులకు అదనంగా, ఎస్సీ వర్గాలకు మరో రూ. 50,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీనివల్ల గృహ నిర్మాణం చేపట్టే దళిత కుటుంబాలకు కొండంత అండ లభించనుంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఈ అదనపు సాయం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకం కానుంది.
గత ప్రభుత్వ హయాంలో ఎస్సీల సంక్షేమం కేవలం ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు బలంగా ఉన్నాయి. నా ఎస్సీలు అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ ప్రభుత్వం, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి ఇతర పథకాలకు వాడేసిందని కూటమి ప్రభుత్వం మండిపడుతోంది. నాడూ-నేడు వంటి పథకాల్లో కూడా సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోకుండా వదిలేశారని, దీనివల్ల దళిత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం గుర్తుచేస్తోంది. పత్రికా ప్రకటనల కోసం కోట్లు ఖర్చు చేయడం తప్ప, వాస్తవ రూపంలో ఎస్సీలకు అందాల్సిన ప్రత్యేక నిధులు అందకుండా పోయాయని పేర్కొంది.
సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఎస్సీ వర్గాల కోసం ఈ ఏడాది ఏకంగా రూ. 20,644 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను పక్కాగా అమలు చేస్తోంది. పారదర్శకమైన పాలనతో, నిధుల మళ్లింపు లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు దళిత వాడల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.
