రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు రాక తీవ్ర ఉద్రిక్తతలకు వేదికైంది. జైలు నుండి విడుదలయ్యాక తన అనుచరులు, వైసీపీ శ్రేణులతో కలిసి భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు ర్యాలీగా బయలుదేరిన ఆయనను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య జరిగిన వాగ్వివాదం, తోపులాటతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతం రణరంగంగా మారింది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఈ ర్యాలీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని పోలీసులు స్పష్టం చేయడంతో వివాదం మొదలైంది.
అంబటి రాంబాబు కాన్వాయ్ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే, పోలీసులు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. నగరంలో ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, తక్షణమే కాన్వాయ్‌ను నిలిపివేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే, పోలీసుల మాటను ఏమాత్రం లెక్కచేయకుండా వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ మరియు ఇతర అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను పక్కకు తోసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో పోలీసులు వారిని నిలువరించేందుకు గట్టిగా ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఈ రాజకీయ గొడవ వల్ల సామాన్య ప్రజలు నరకం చూడాల్సి వచ్చింది. అంబటి కాన్వాయ్‌ను నిలిపివేయడం, దానికి తోడు వైసీపీ కార్యకర్తల హడావుడి వల్ల ఇన్నర్ రింగ్ రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అటు విజయవాడ వైపు వెళ్లే వారు, ఇటు నగరం లోపలికి వచ్చే ప్రయాణికులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా మండుతున్న ఎండలో చిన్న పిల్లలు, వృద్ధులు అల్లాడిపోయారు. గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో ప్రయాణికులు పోలీసులపై, అటు రాజకీయ నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పరిస్థితిని గమనించిన ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, గుంపులుగా తిరగడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రదర్శనల కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు వైసీపీ నేతలను ఒప్పించి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అంబటి రాంబాబును తన వాహనంలో మాత్రమే వెళ్లాలని, ర్యాలీగా వెళ్లేందుకు వీలులేదని నిబంధనలు విధించి పంపించివేశారు. ఈ ఘటన గుంటూరు రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచింది. రాజకీయ కార్యక్రమాల వల్ల సామాన్యుల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
