ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఈసారి మరో కారణంతో సోషల్ మీడియాలో బాగా చర్చకు వచ్చింది. సంప్రదాయాలు, భక్తి భావం మాత్రమే కాకుండా, అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఒక ఐపీఎస్ అధికారిణి చేసిన గిరిజన నృత్యం సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ తీసుకొచ్చింది .
మేడారం జాతరలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన ఐపీఎస్ అధికారిణి వసుంధర యాదవ్, గిరిజనుల ఉత్సవ వాతావరణంలో భాగంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. ఆ దృశ్యాలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. కొందరు నెటిజన్లు ఆమెను “మేడారం మోనాలిసా” అంటూ పిలవడం మొదలుపెట్టారు.
ఇటీవల కుంభమేళాలో పూసలు అమ్మే యువతిని మోనాలిసాగా పిలిచి సెలబ్రిటీగా మార్చిన తరహాలోనే, ఈసారి కూడా ఒక ఐపీఎస్ అధికారిణిని కూడా అదే పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె విధులు నిర్వహించిన తీరు కంటే, ఆమె అందం, డ్యాన్స్‌పై ఎక్కువగా పోస్టులు పెట్టడం పలు వర్గాల నుంచి విమర్శలకు దారి తీసింది.
మంత్రి సీతక్కతో పాటు ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి వసుంధర యాదవ్ డ్యాన్స్ చేసిన వీడియోలు మరింత వైరల్ గా మారాయి. దీంతో ఆమె గురించి సోషల్ మీడియాలో సెర్చ్‌లు పెరిగాయి. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అని, గతంలో గ్రేహౌండ్స్‌లో పనిచేసిన అనుభవం ఉందని నెటిజన్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిధిలో కల్లూరు ఏసీపీగా పని చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే, ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారిని కేవలం డ్యాన్స్ లేదా రూపం ఆధారంగా ప్రచారం చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమె అందం లేదా వీడియోలకన్నా, ఆమె సేవలు, విధి నిర్వహణను గుర్తించాలనే మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా హైప్ కంటే, ప్రజాసేవలో ఆమె చేసిన కృషికి ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.
మేడారం జాతర భక్తి, సంప్రదాయం, ప్రజాసేవకు ప్రతీకగా నిలవాలని, వ్యక్తిగత హైలైట్‌లతో దాని అసలు ఉద్దేశం మసకబారకూడదని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
