Indian Cricket Team News: అవన్నీ అబద్ధాలే.. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..!!

Indian Cricket Team News

Indian Cricket Team News

Indian Cricket Team News: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉండగానే, జట్టులోని అంతర్గత వాతావరణంపై వస్తున్న పుకార్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గెలిచిన మరుసటి రోజే మీడియా ముందుకు వచ్చిన ఆయన, డ్రెస్సింగ్ రూమ్ అశాంతిగా ఉందన్న వార్తలను “కేవలం అబద్ధాలు” అని కొట్టిపారేశారు. జట్టులో ప్లేయర్లు తనతో సంతోషంగా లేరన్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఒకవేళ అదే నిజమైతే తాను ఆ బాధ్యతల్లో ఒక్క నిమిషం కూడా కొనసాగనని స్పష్టం చేశారు.

గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి టీమిండియా ప్రయాణం ఎత్తుపల్లాలతో సాగింది. ఒకవైపు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ వంటి భారీ ఐసీసీ టైటిళ్లను ముద్దాడిన భారత్, మరోవైపు ద్వైపాక్షిక సిరీస్‌లలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లపై టెస్ట్, వన్డే సిరీస్‌లలో ఓటమి పలకరించడంతో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో కొందరు సీనియర్లు వీడ్కోలు పలకడం కూడా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది.

ఈ విమర్శలపై గంభీర్ తనదైన శైలిలో స్పందించారు. “నా పనితీరుకు ఆటగాళ్ల సంతోషమే కొలమానం. మెజారిటీ ప్లేయర్లు నమ్మకంగా ఉన్నప్పుడే నేను సరైన మార్గంలో ఉన్నానని భావిస్తాను” అని ఆయన పేర్కొన్నారు. టీమిండియా అంటే ఎప్పుడూ కెమెరా కళ్ల ముందే ఉంటుందని, ఏదైనా సమస్య ఉంటే అది దాచినా దాగదని గుర్తు చేశారు. ప్రాక్టీస్ సెషన్లు, ప్రయాణాల్లో ఆటగాళ్ల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గమనిస్తే ఎవరికైనా అసలు విషయం అర్థమవుతుందని, అనవసరమైన ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు.

ప్లేయర్ల ఎంపిక విషయంలోనూ గంభీర్ ఒక స్పష్టమైన సిద్ధాంతాన్ని బయటపెట్టారు. “మేము ఆటగాళ్లను కేవలం ఆశ మీద కాకుండా, పూర్తి నమ్మకం తో ఎంపిక చేస్తాం” అని ఆయన అన్నారు. ఒక ఆటగాడిని నమ్మి జట్టులోకి తీసుకున్నప్పుడు, కేవలం ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఆ నమ్మకాన్ని వదులుకోమని చెప్పారు. ఆశతో తీసుకుంటే అది త్వరగా ఆవిరైపోతుందని, కానీ నమ్మకంతో అవకాశం ఇస్తే అది ఆటగాడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని గంభీర్ విశ్లేషించారు.

జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్లు ఒకే లక్ష్యం కోసం పని చేస్తున్నారని కోచ్ పునరుద్ఘాటించారు. అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లైనా, సీనియర్లైనా సరే.. అవకాశం వచ్చినప్పుడు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే ఆటగాళ్లు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇదే టీమిండియా వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలవడానికి ప్రధాన కారణమని గంభీర్ ఈ సందర్భంగా కొనియాడారు.