Vizag Traffic Updates: విశాఖలో మరో ఫ్లైఓవర్…. భోగాపురం ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్!

Vizag Traffic Updates

Vizag Traffic Updates

Visakhapatnam News: విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఇకపై ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఆనందపురం జంక్షన్‌ వద్ద కొత్తగా ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలనను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ శనివారం నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో మూడు నెలల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ లోపు ఆనందపురం వద్ద తలెత్తే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఆనందపురం జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అనకాపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు, విశాఖ నగరం నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు ఇక్కడే కలుస్తుండటంతో జంక్షన్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు లభించాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో ఈ భారీ వంతెన నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అయితే, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా వచ్చే వారం పది రోజుల్లోనే తాత్కాలిక పనులను ప్రారంభించి, రెండు నెలల్లో పూర్తి చేయనున్నారు. జంక్షన్ వద్ద రోడ్డును వెడల్పు చేయడం ద్వారా వాహనాల రాకపోకలను సులభతరం చేయాలని చూస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చే సమయానికి కనీసం తాత్కాలికంగానైనా ట్రాఫిక్ ఫ్రీ జర్నీ ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కేవలం రోడ్ల విస్తరణే కాకుండా, ఆ ప్రాంతంలోని మార్కెట్ వల్ల కలిగే రద్దీని తగ్గించేందుకు కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఆనందపురం పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ ప్రస్తుతం ప్రధాన రహదారిపైనే ఉండటంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. అందుకే ఈ మార్కెట్లను సమీపంలోని 95 సెంట్ల ప్రభుత్వ స్థలానికి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ సౌకర్యంతో పాటు, రైతులు తమ వాహనాలను నిలుపుకోవడానికి విశాలమైన పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

విశాఖపట్నం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆనందపురం జంక్షన్‌ను ఒక మోడల్ జంక్షన్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారికి ఎక్కడా సిగ్నల్స్ అడ్డు లేకుండా, సాఫీగా ప్రయాణం సాగేలా సమగ్రమైన రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే అటు ఉత్తరాంధ్ర ప్రజలకు, ఇటు విదేశీ ప్రయాణికులకు కూడా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఆనందపురం ప్రాంతం కూడా ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.